సైబరాబాద్ కమిషనరేట్ లో సురక్షా కవచ్ పై అవగాహన కార్యక్రమం
సైబరాబాద్ పోలీస్, టీజీఎన్బీ, ఎస్సీఎస్సీ భాగస్వామ్యంతో విద్యా సంస్థలలో బాలల భద్రత బలోపేతం, భౌతిక, సైబర్, మానసిక మరియు రోడ్డు భద్రతపై ప్రధాన దృష్టి సారించారు. ఇందులో భాగంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ‘సురక్షా కవచ్’ అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ‘సురక్షా కవచ్’ కార్యక్రమం నాలుగు ముఖ్య భద్రతా అంశాలపై దృష్టి సారించిందని ఇవి విద్యార్థుల్లో భద్రతా చైతన్యాన్ని పెంపొందించడంలో కీలకంగా ఉంటాయని టీజీఎన్బీ డైరెక్టర్ సందీప్ శాండిల్యా అన్నారు. పిల్లలను నైతిక విలువలతో పెంచాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు మాదకద్రవ్య వ్యసన నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు వ్యసన నివారణపై వ్యాసరచన, వాదనల పోటీలు, వీధి నాటికలు, స్వల్పచిత్రాలు వంటివి తయారు చేసి [email protected] కు పంపాలని ఆయన కోరారు. “డ్రగ్స్‌కు కాదు – కలలకు అవును”, “ఆరోగ్యం ఎన్నుకోండి – హాని కాదు” వంటి నినాదాలు ప్రచారం అంశాలుగా ఉండాలని చెప్పారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి మాట్లాడుతూ పాఠశాలల్లో సురక్షా కవచ్ / సేఫ్టీ క్లబ్స్‌ను వ్యవస్థాపకంగా ఏర్పాటు చేయాలని సూచించారు. చిన్ననాటి నుంచే సివిక్ సెన్స్ నేర్పడం అవసరమని, ఎందుకంటే నేటి పిల్లలే రేపటి నాయకులని చెప్పారు.
ఈ కార్యక్రమంలో టీజీఎన్బీ డీఐజీ అభిషేక్ మహంతి, ఐపీఎస్, ఎస్బీ డీసీపీ సాయి శ్రీ, ఎస్సీఎస్సీ జనరల్ సెక్రటరీ రమేష్ కాజా, ఎస్సీఎస్సీ సీఈఓ నవేద్ ఖాన్, డా. వనిత డట్లా, ఎస్సీఎస్సీ జాయింట్ సెక్రటరీ – చైల్డ్రన్ & యూత్ సేఫ్టీ ఫోరం, ఎస్సీఎస్సీ ఈసీ సభ్యులు, ఎస్సీఎస్సీ కార్యాలయ బృందం, పాఠశాలల ప్రతినిధులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.