రాచకొండలో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠా అరెస్టు
బర్త్.. డెత్.. క్యాస్ట్ ఏ సర్టిఫికెట్ కావాలన్న క్షణాల్లో అందిస్తూ సొమ్ము చేసుకుంటున్న ఓ ముఠాకు సరూర్ నగర్ ఎస్ఓటి పోలీసులు చెక్ పెట్టారు. ఈ ముఠా నిమ్స్ ఆస్పత్రి న్యూరో సర్జన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీధర్, కింగ్ కోఠి ఆస్పత్రి ఫార్మసీ సూపర్ వైజర్ పాండు, లైసెన్స్ స్టాంప్ వెండర్ అలాగే లాయర్ల రబ్బర్ స్టాంప్స్ తయారు చేసి ఆయా సర్టిఫికెట్లను రూ. 500 నుండి వెయ్యి వరకు విక్రయాలు చేస్తున్నట్లు ఎల్బీనగర్ క్యాంప్ కార్యాలయంలో రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు. ఈ ముఠాలో 13మంది నిందితులు ఉన్నారని వారిలో ఆరుగురు వెంకట్ భాను ప్రకాష్, సాగరిక, చంద్రశేఖర్, అనీల్, జలీల్, కిషోర్ లను అరెస్టు చేశామని చెప్పారు. ఇప్పటి వరకు ఈ ముఠా 181 నకిలీ సర్టిఫికెట్లు తయారు చేశారని తెలిపారు. వీటితో ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించడమే కాకుండా నకిలీ స్టాంప్ పేపర్లతో స్థలాలు రిజిస్ట్రేషన్ అయినట్లు లోన్ లు కూడా తీసుకున్నారని, వీరి నుండి సర్టిఫికెట్లు పొందిన వారి వివరాలు సేకరిస్తున్నామని సీపీ సుధీర్ బాబు తెలిపారు. పరారీలో ఉన్న ముఠా సభ్యుల కోసం గాలిస్తున్నామని చెప్పారు. నిందితులకు చెక్ పెట్టిన ఎస్ఓటి, సరూర్ నగర్ పోలీసులను ఆయన అభినందించారు.