ఏపీ లిక్కర్ కేసులో కీలక మలుపు.. ధనుంజయరెడ్డి..కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్
ఏపీ మద్యం కుంభకోణం కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఆరోపణలు, విచారణను ఎదుర్కొంటోన్న మాజీ ఐఎఎస్ అధికారి కే. ధనంజయరెడ్డి, పీ కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. కృష్ణమోహన్ రెడ్డి- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓఎస్డీగా పని చేశారు. ఇప్పుడు వీరిద్దరూ అరెస్ట్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపినట్టయింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా చెబుతోన్న మద్యం కుంభకోణం కేసులో వీరిద్దరూ విచారణను ఎదుర్కొంటోన్నారు. ఈ కేసులో వీరిద్దరూ ఏ31, ఏ32గా ఉన్నారు.
దీనిపై సమగ్ర దర్యాప్తు నిర్వహించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం..ఇప్పటికే ప్రత్యేక విచారణ బృందాన్ని కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
గతంలో విజయసాయిరెడ్డి, వైఎస్ఆర్సీపీకి చెందిన కడప లోక్ సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి సిట్ విచారణకు హాజరై తమ వివరణలను ఇచ్చుకున్నారు. ఇదే కేసులో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ కావడం చర్చనీయాంశమైంది.