మూడు కేసుల్లో 3.455 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురి అరెస్ట్
ఎస్టిఎఫ్, ఎన్‌ఫొర్స్‌మెంట్ కలిసి మూడు కేసుల్లో 3.455 కేజీల గంజాయినిపట్టుకొని ముగ్గురిని అరెస్టు చేశారు. ఎలక్ట్రికల్ పనులు చేసుకుంటు ఉప్పల్‌లో నివాసం ఉంటున్న ఈస్టు గోదావరికి చెందిన రాజ్‌పాక సతీష్ అనే వ్యక్తి సైడ్ బిజినెస్‌గా గంజాయి అమ్మకాలు సాగిస్తున్నాడు. ఇప్పటికే ఇతనిపై రెండు కేసులు కూడ ఉన్నాయి. శుక్రవారం ఆదర్శనగర్ పెట్రోల్ బంక్ సమీపంలో గంజాయి అమ్మకాలు జరుపుతూ ఎస్టిఎఫ్ డీ టీమ్ ఎక్సైజ్ సిబ్బందికి పట్టుబడ్డాడు. నిందితుని వద్ద 1.800 కిలోల గంజాయిని ఎస్టిఎఫ్ సీఐ నాగరాజు, ఎస్సై జ్యోతి సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. తరుచు ఆంధ్రా ప్రాంతానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో తన బ్యాగుల్లో రెండు నుంచి మూడు కిలోలు గంజాయి తీసుకొని వచ్చి హైదరాబాద్‌లో అమ్మకాలు సాగిస్తాడని సీఐ నాగరాజు తెలిపారు. నిందితుడిని, గంజాయిని, స్క్రూటీని ఉప్పల్ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు.
మరో కేసులో..
రంగారెడ్డి ఎన్‌ఫొర్స్‌మెంట్ సీఐ సుబాష్‌చందర్, ఎస్సైవెంకటేశ్వర్లు హయత్‌నగర్ వనస్థలీపురంలో గంజాయి అమ్మకాలు జరుపుతున్న ముత్యాల తిరుమలేష్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడి వద్ద 1.335 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇదే టీమ్ ఇబ్రహీంపట్నం బొంగులూరు ప్రాంతంలో గంజాయి అమ్మకాలు జరుపుతున్న చింతపల్లి వెంకటేష్ ని అరెస్టు చేసి 320 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.