కేంద్రం నిర్ణయంతో పెరిగిన రేవంత్ పరపతి..!
- కులగణన చేయాలని కేంద్రం నిర్ణయం
- ఇప్పటికే తెలంగాణలో కులగణన పూర్తి
- కేంద్రం నిర్ణయంతో దేశవ్యాప్తంగా మార్మోగుతున్న రేవంత్ పేరు
- కులగణనలో తెలంగాణ మోడల్ తీసుకోవాలని విజ్ఞప్తి
- కాంగ్రెస్ అధిష్టానం దగ్గర పెరిగిన రేవంత్ పరపతి
కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలతోపాటు కులగణన కూడా చేయాలని నిర్ణయం తీసుకోవడం.. తెలంగణ సీఎం రేవంత్‌రెడ్డికి కలిసొస్తోంది. ఇప్పటికే తెలంగాణలో కులగణనను నిర్వహించడంతో.. ఇప్పుడు దేశవ్యాప్తంగా సీఎం రేవంత్‌రెడ్డి పేరు మార్మోగుతోంది. అటు కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర రేవంత్‌రెడ్డి పరపతి కూడా పెరిగింది. రాష్ట్రంలో చేపట్టిన కులగణనలో అనేక అవకతవకలు జరిగినప్పటికీ.. కేంద్రం కులగణన చేస్తామని ప్రకటించగానే.. రేవంత్‌రెడ్డి దూకుడు పెంచారు. కులగణనలో తెలంగాణ మోడల్‌ని తీసుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అటు కాంగ్రెస్ అగ్రనేత కూడా కులగణనలో తెలంగాణని మోడల్‌గా తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో ఇది దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది.
ఓబీసీల సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలు దేశానికి స్ఫూర్తిని కలిగించడంతో పాటు అనుసరించేందుకు అంగీకరించడం గర్వంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని భారత్ జోడో యాత్రలో మొదటిసారి రాహుల్ గాంధీ డిమాండ్ చేశారని సీఎం ప్రస్తావించారు. రాహుల్ విజన్ మేరకు దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో కులగణన చేపట్టినట్లు రేవంత్‌రెడ్డి వివరించారు. అటు కేంద్ర ప్రభుత్వం చేపట్టే కులగణనకు కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. కేంద్రం అనూహ్యంగా తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. అయితే, కులగణనకు ఒక డెడ్‌లైన్ ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణలో చేపట్టిన కులగణన బ్లూప్రింట్‌గా నిలుస్తుందని చెప్పిన ఆయన, రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని కూడా ఎత్తివేయాలని అన్నారు. కులగణన కేవలం తొలి అడుగు మాత్రమేనని ఇంకా చాలా చేయాల్సి ఉందని చెప్పారు.
ఇకపోతే.. కులగణనలో తెలంగాణ మోడల్ తీసుకోవాలని, ప్రతి రాష్ట్రంతో మాట్లాడి ఆయా ప్రభుత్వాల సూచనలు తీసుకోవాలని కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కులగణన సమాజానికి ఎక్స్‌రే లాంటిదని రాహుల్ అన్నారని గుర్తు చేశారు. అన్ని రాష్ట్రాలకు నిపుణుల కమిటీ పంపాలని, కులగణనలో కేంద్రం, రాష్ట్రాలు కలిసి పని చేయాలని ఆకాంక్షించారు. ఈ విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో చేపట్టిన 8 పేజీల్లో 57 ప్రశ్నల ద్వారా వివరాలు సేకరించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కులగణన విషయంలో తెలంగాణ అనుభవం కేంద్రానికి ఉపయోగపడుతుందన్నారు. ఎన్యుమరేటర్ నుంచి సీఎస్ వరకు పలుసార్లు సమీక్ష చేసినట్లు వివరించారు. కులగణన విషయంలో అనేక సూచనలు, సలహాలు వచ్చాయన్నారు. టోల్‌ఫ్రీ నెంబర్ ఇచ్చామన్న ఆయన.. ఆన్‌లైన్‌లో నమోదుకు అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా కులగణన చేపట్టామని గుర్తు చేశారు. మొత్తానికి కేంద్రం నిర్ణయంతో కాంగ్రెస్ అధిష్టానం దగ్గర మరోసారి రేవంత్ మంచి మార్కుల కొట్టేశారు.