జిన్నారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన అధికారులు
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలోని ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డిఆర్డిఓ పి.డి. జ్యోతి తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యాన్ని పరిశీలించారు. గత నాలుగు రోజుల నుంచి కేంద్రం వద్ద జరుగుతున్న పరిస్థితులపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారికి వివరించారు. సిబ్బంది పనితీరు బాగోలేదని, ధాన్యం తూకం వేయడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. భారీ వర్షానికి ధాన్యం తడుస్తోందని సమయానికి తూకం వేయడం లేదన్నారు. టోకెన్ల ప్రకారం కాకుండా ఇష్టానుసారంగా సిబ్బంది తూకం వేస్తున్నారని అధికారికి తెలిపారు. కేంద్రం వద్ద హమాలీలు, గన్ని సంచులు, టార్పలిన్ కవర్లు లేవని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల ఆవేదన విన్న అధికారి వెంటనే స్పందిస్తూ ఐకెపి ఎపిఎం నరేందర్ కు, విఏఓ లత కు షోకాస్ నోటీసు ఇస్తామని సూచించారు. గత 15 రోజులుగా కేంద్రం వద్ద పడిగాపులు కాస్తు ధాన్యాన్ని విక్రయించేందుకు నాన్న యాతన పడుతున్నామని అధికారికి రైతులు బోరున విలపిస్తూ విన్నవించారు. సిబ్బంది అవినీతిపై అధికారులు సరైన చర్యలు తీసుకోవాలని రైతులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. అనంతరం అధికారి సివిల్ సప్లై డీఎస్ఓతో ఫోన్లో మాట్లాడి వెంటనే లోడ్ నింపేందుకు లారీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. స్థానికంగా నెలకొన్న ఇబ్బందులను పరిశీలించేందుకు రావాలని సూచించారు. కొనుగోలు కేంద్రం వద్ద తూకంలో అవకతవకలు జరుగుతున్నాయని రైతులు ఆరోపిస్తూ ఏపీఎం సమక్షంలో తూకాన్ని పరిశీలించగా వాస్తవాలు బయటపడ్డాయి. ఈ వ్యవహారంపై రైతులు సిబ్బందిని ప్రశ్నించగా తెల్ల మొహం వేశారు.