ఈ నెల 20న దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి
ఈ నెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో మేడ్చల్ మున్సిపల్ కార్యాలయం వద్ద వాల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సిఐటియు మేడ్చల్ మండల కన్వీనర్ నరేష్ మాట్లాడుతూ మున్సిపాల్టీలలోని 75 వేల మంది మున్సిపల్ కార్మికులు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, ఎన్ఎంఆర్, ఫిక్స్డ్ పే తదితర పద్ధతుల్లో పనిచేస్తున్న కార్మికులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాజిక భద్రత కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు. కార్మికులకు రావాల్సిన హక్కులపై ఈ నెల 20న జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో మున్సిపల్ ఉద్యోగ, కార్మికులందరూ పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలనికోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మున్సిపల్ కార్మిక యూనియన్ నాయకులు మల్లేష్, మామిండ్ల మల్లేష్, లక్ష్మా రెడ్డి, గోటిముకుల రాజు, స్వామి, సురేష్, రవి, శ్రీనివాస్ రెడ్డి, కొత్తపల్లి రవి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.