తాను ప్రేమించిన అమ్మాయి దక్కలేదని..
కెపిహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 12వ తేదీన జరిగిన హత్య కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు మీడియా సమావేశాన్ని నిర్వహించి నిందితుల వివరాలను బాలానగర్ డిసిపి సురేష్ కుమార్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అయ్యప్ప స్వామి అలియాస్ పవన్( 27) అనే వ్యక్తి వెంకటరమణ అనే వ్యక్తి భార్యను గతంలో వన్ సైడ్ లవ్ చేశాడు. అమ్మాయితో పెళ్లి చేయాలని ఆమె తల్లిదండ్రులను అడగగా వారు నిరాకరించి వెంకటరమణకు ఇచ్చి వివాహం చేశారు. వారి పెళ్లి అయి ఏడు సంవత్సరాలు గడుస్తున్న ఇంకా తనను మర్చిపోలేక చెడు అలవాట్లకు బానిసగా మారాడు. పవన్ ఇటీవల జాబ్ కోసం హైదరాబాద్ లోని కెపిహెచ్బి వచ్చాడు. తను ప్రేమించిన అమ్మాయి మరో వ్యక్తిని పెళ్లి చేసుకొని ఇక్కడే నివాసం ఉంటుందని తెలుసుకున్న పవన్ తనకు దక్కకుండా వెంకటరమణకు ఇచ్చి పెళ్లి చేయడంతో కక్ష పెంచుకొని ఈ నెల 12వ తేదీన మరో నలుగురు స్నేహితుల సహాయంతో అర్ధరాత్రి సమయంలో గొడవకు దిగి కత్తితో గుండెలో పొడిచి దాడి చేయడంతో వెంకటరమణ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా మరుసటి రోజు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అప్పటికి పరారీలో ఉన్న పవన్ ను గాలింపు చర్యలు చేపట్టి నేడు అదుపులోకి తీసుకున్నట్లు డిసిపి సురేష్ కుమార్ తెలిపారు. నిందితులను నేడు రిమాండ్ కు తరలించినట్లు ఆయన వెల్లడించారు.