ఈటెల వ్యాఖ్యలు సిగ్గుచేటు: కొల్కురి నరసింహారెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపైన బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని సంగారెడ్డి జిల్లా ఐఎన్ టియుసి పటాన్ చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, శ్రమశక్తి అవార్డు గ్రహీత కొల్కురి నరసింహారెడ్డి అన్నారు. పటాన్ చెరు పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వంలో అసైన్డ్ భూముల కబ్జా చేసిన కారణంగానే ఈటలను ఆ పార్టీ నుండి బర్తరఫ్ చేశారని గుర్తు చేశారు.
కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ తెలంగాణకు బడ్జెట్ కేటాయింపుల్లో జరిగిన అన్యాయంపై ఈటెల రాజేందర్ మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందని కొల్కురి విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిపారని, రూ. 3 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చి లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని కొనియాడారు. ఆరు గ్యారెంటీలతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షాన నిలబడిందని ఆయన స్పష్టం చేశారు. అయినప్పటికీ, పదవి కోసం వెంపర్లాడుతున్న ఈటెల రాజేందర్ రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డిలపై అర్థంలేని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
సంగారెడ్డిలో ఐఐటీ ఏర్పాటు చేయడంలో, వేలాది మంది పేదలకు భూముల పట్టాలు, ఇళ్ల స్థలాలు ఇప్పించడంలో జగ్గారెడ్డి కృషి ఎంతో ఉందని కొల్కురి నొక్కి చెప్పారు. అలాగే, మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు ఇటీవల కొన్ని పత్రికల్లో చేసిన వ్యాఖ్యలను చూసి ఆశ్చర్యపోయానని అన్నారు. జిన్నారం ఉర్దూ స్కూల్‌లో బంగ్లాదేశ్ పౌరులు ఉన్నారంటూ కాంగ్రెస్‌ను నిందించడం అవివేకమని ఆయన అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండి, హోం మంత్రి అమిత్ షా ఉండగా, మెదక్ ఎంపీగా బీజేపీ నేత ఉన్నప్పటికీ ఇలా జరగడం పూర్తిగా బీజేపీ వైఫల్యమని కొల్కురి నరసింహారెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంజీవ రెడ్డి,మాజీ పీసీసీ కార్యదర్శి మతీన్,మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అతిక్,శ్రీనివాస్,అక్షితు రాజు తదితరులు పాల్గొన్నారు.