అదిగో యుద్ధం..దోపిడీకి వ్యాపారులు సిద్ధం

By Ravi
On
అదిగో యుద్ధం..దోపిడీకి వ్యాపారులు సిద్ధం


దేశ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం.. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని అయోమయం.. యుద్ధం వస్తే ఎలా ఎదుర్కొవాలి ఎలా తమను తాము రక్షించుకోవాలో  దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించిన పోలీసులు.. ప్రజల్లో భయం పోగొట్టి ధైర్యం నింపే ప్రయత్నాలు.. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది.. జనాలను మాత్రం భయం వెంటాడుతూనే ఉంది. యుద్ధం వస్తుందేమో అని కాదు.. దాన్ని అడ్డుపెట్టుకుని వ్యాపారులు చేసే దోపిడీ వ్యవస్థ విని  అదిరిపోయి బెదిరిపోతున్నారు. పాకిస్తాన్ తో యుద్ధం మొదలైంతే సరుకుల రవాణా తగ్గిపోతుందని, నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడుతుందని ధరలు ఆకాశాన్ని అంటే అవకాశం ఉందంటూ ప్రచారం మొదలైంది. సోషల్ మీడియాలో జరిగే ప్రచారాలు.. వ్యాపారులు చెప్పే విషయాలు జనాలను అయోమయంలోకి నెడుతున్నాయి. మూడునెలల సరుకులు ఇప్పుడే తీసుకు వెళ్తే సరిపోతుందంటూ ఆలోచనలు రేగుతున్నాయి. ఇదే అదనుగా భావించిన కొందరు వ్యాపారులు అక్రమ నిల్వలు చేసి  కొరత సృష్టించి ధరల దోపిడీకి పెద్ద స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. అందుకే ఎప్పుడు లేనంతగా కిరాణా షాపుల వద్ద జనం తెగ క్యూ కడుతున్నారు.
వాస్తవానికి పాకిస్తాన్ నుండి మనకు దిగుమతి అయ్యేవి రాగి, సుంగంధ ద్రవ్యాలు, ఉప్పు, పత్తి, ఖర్జురాలు, అంజూరా పండ్లు మాత్రమే. కానీ నిత్యావసర వస్తువులు కూడా అంటూ కొందరు వ్యాపారులు మార్కెట్ లో ప్రచారం మొదలు పెట్టి జనాలను మోసం చేయడం మొదలు పెట్టారు. ఎలాంటి ఆదేశాలు లేక పోయినా ఇప్పటికే నిత్యావసర వస్తువులపై ధరలు పెంచి అడ్డదిడ్డంగా దోచుకుంటున్నారు. కొందరు నిలదీయగా యుద్ధం వస్తుందేమో అని ఎక్కడి రవాణా అక్కడ నిలిచిపోయింది అని అందుకే మార్కెట్ వెలవెల బోతోందంటూ సమాధానాలు ఇస్తున్నారని జనం చెబుతున్నారు.
బాడా వ్యాపారులంతా సిండికేట్ అయి కృత్రిమ కొరత సృష్టించాలని ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా చిన్న చిన్న వ్యాపారులతో ప్రచారం మొదలు పెట్టారు. యుద్ధం ఆసరా చేసుకుని జనాలను మోసం చేసే పనిలో నిమగ్నమై ఉన్న వ్యాపారులపై ప్రభుత్వం, అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని జనం కోరుతున్నారు. ప్రాణాలు పోయే కన్నా ప్రాణాలు తోడేస్తున్న వ్యాపారుల భారతం పట్టాలని వేడుకుంటున్నారు. దేశ సరిహద్దుల్లో ఉన్న శత్రువుల కన్నా అంతర్గత దోపిడీ దొంగలతోనే ముంపు పొంచివుందని చెబుతున్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, ఏ చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి.1086479-veggies

Tags:

Advertisement

Latest News