భద్రాచలంలో భారీగా గంజాయి స్వాధీనం
గంజాయి డ్రగ్స్ నియంత్రణ లో భాగంగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ తెలంగాణ రాష్ట్రంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. భద్రాచలం ప్రాంతంలోని గోదావరి ఇసుక ర్యాంప్ సమీపంలో అనుమానంగా వెళుతున్న కారును తనిఖీలు నిర్వహించగా అందులో 75 కేజీల గంజాయి పట్టుబడినట్లు ఎన్ఫోర్స్మెంట్ సీఐ రమేష్ తెలిపారు.
ఒరిస్సా నుంచి రాజస్థాన్ కు అక్రమంగా తరలిపోతున్న ఈ గంజాయిని ఎన్ఫోర్స్మెంట్ టీం దాడి చేసి పట్టుకున్నారు. గంజాయి, కారుతో కలిపి రూ. 41 లక్ష విలువ ఉంటుందని తెలిపారు. గంజాయిని పట్టుకున్న కేసులో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. గంజాయిని తీసుకు వెళుతున్న రాజస్థాన్ కు చెందిన అనిల్ కుమార్ శర్మ, ముఖేష్ కుమార్ దేవ్ లను అరెస్ట్ చేయగా పాల్వంచకు చెందిన దుర్గాప్రసాద్ గంజాయి సరఫరా చేశాడని నిందితులు విచారణలో వెల్లడించారు. ఈ మేరకు ఆయనపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్ నియంత్రణలో భాగంగా ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ ఐఏఎస్, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం ఐపీఎస్, ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేశారు. ఈ డ్రైవ్ లో భాగంగా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి మరియు అసిస్టెంట్ కమిషనర్ గణేష్ లు గంజాయిని పట్టుకున్న ఎన్ఫోర్స్మెంట్ టీంను అభినందించారు.