ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు హైకోర్టు నోటీసులు..!
హైదరాబాద్ TPN : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిపై పోలీసులు నమోదు చేసిన కేసులో ఫిర్యాదుదారైన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తనకు వ్యతిరేకంగా నకిలీ వీడియోలను విడుదల చేశారని కేటీఆర్, జగదీశ్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్లో తీన్మార్ మల్లన్న ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గతేడాది మే 25న వారిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో తమపై నమోదైన ఈ కేసును కొట్టేయాలని కోరుతూ కేటీఆర్, జగదీశ్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ మౌసమీ భట్టాచార్యకు పిటిషనర్ల తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. వ్యక్తిగతంగా ఎవరినీ ఉద్దేశించి కేటీఆర్, జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యలు చేయలేదని.. రాజకీయ కక్షసాధింపులో భాగంగా నమోదైన కేసును కొట్టివేయాలని కోరారు. వాదనలను విన్న న్యాయమూర్తి పోలీసులు, తీన్మార్ మల్లన్నకు నోటీసులు జారీ చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వారిని ఆదేశిస్తూ విచారణను జూన్ 13కు వాయిదా వేశారు.