ఓబుళాపురం మైనింగ్ కేసులో జడ్జిమెంట్ ఇచ్చిన నాంపల్లి సీబీఐ కోర్టు.. 5గురికి శిక్ష..ఇద్దరికి క్లీన్ చిట్
ఓబుళాపురం మైనింగ్ కేసులో నాంపల్లి
సీబీఐ కోర్టు తుది తీర్పు వెలువరించింది. సుదీర్ఘ విచారణ అనంతరం 15ఏళ్ల తర్వాత ఈ కేసులో మొత్తం ఐదుగురిని దోషులుగా, ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న గాలి జనార్దన్ రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, మెఫజ్ అలీఖాన్, గనుల శాఖ అప్పటి డైరెక్టర్ గా ఉన్న వీడీ రాజగోపాల్ ను దోషులుగా నిర్ధారిస్తూ ఏడేళ్ల పాటు జైలు శిక్ష, ఒక్కొక్కరికి లక్ష రూపాయల జరిమాన విధించింది. ఇదే కేసులో అప్పటి గనుల శాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డికి క్లీన్ చిట్ లభించింది. ఆమెతో పాటు అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శి కృపానందంను సీబీఐ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. గాలి జనార్ధన్ రెడ్డి శిక్ష రద్దు చేయాలని ఆయన తరఫు న్యాయవాది చేసిన వాదనలపై కోర్ట్ ఓ దశలో సీరియస్ అయ్యింది. శిక్షను ఖరారు చేస్తున్న సమయంలో జడ్జి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యావజ్జీవ శిక్షకు మీరంతా అర్హులని ఆయన అన్నారు. మీకు పదేళ్ల జైలు శిక్షను ఎందుకు విధించకూడదని ప్రశ్నించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన అనంతపురం జిల్లా ఓబుళాపురం మైనింగ్ కేసులో ప్రముఖ మైనింగ్ వ్యాపారి గాలి జనార్దనరెడ్డితో పాటు అప్పటి మంత్రి, పలువురు సీనియర్ అధికారులు నిందితులుగా ఉండటంతో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. ఓఎంసీ అక్రమాలు, అక్రమ మైనింగ్‌పై 2009లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్రం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది. 2011లో సీబీఐ మొదటి ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఆ తర్వాత ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి, గాలి జనార్దనరెడ్డి వ్యక్తిగత సహాయకుడు మెఫజ్ ఆలీఖాన్‌ను, అప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డిని నిందితులుగా చేరుస్తూ సీబీఐ అనుబంధ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో బీవీ శ్రీనివాసరెడ్డి, గాలి జనార్దనరెడ్డి, ఓబుళాపురం మైనింగ్ కంపెనీ, గాలి వ్యక్తిగత సహాయకుడు ఆలీఖాన్, గనుల శాఖ అప్పటి డైరెక్టర్ వి.డి. రాజగోపాల్, మాజీ ఐఏఎస్ కృపానందం, అప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డిలపై ఐపీసీ సెక్షన్లతో పాటు కొంతమందిపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేశారు. సుప్రీంకోర్టు ఈ కేసు విచారణను పర్యవేక్షిస్తూ మే నెలలోగా పూర్తి చేయాలని గడువు విధించడంతో సీబీఐ కోర్టులో గత నెల వాదనలు పూర్తయ్యాయి. 2022లో హైకోర్టు ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని ఈ కేసు నుంచి డిశ్చార్జ్ చేసింది. మిగిలిన నిందితులకు సంబంధించి సీబీఐ కోర్టులో నేడు తీరు ఖరారు చేసింది. శిక్ష పడిన నిందితులను జైల్ కి తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు పూర్తి చేశారు.