15 ఎకరాల భూమి కబ్జా.. రంగంలోకి హైడ్రా
మేడ్చల్ జిల్లా: కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం విలేజ్‌లో 15 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. సర్వే నంబరు 354లో ఉన్న ప్రభుత్వ భూమిలో కబ్జాలను హైడ్రా తొలగించింది. ఇందులో కేఎల్‌యూనివర్సిటీ ఆక్రమించిన 5 ఎకరాల భూమి కూడా ఉంది. వాస్తవానికి ఈ భూమిని రాజీవ్‌స్వగృహ నిర్మాణాలకు గాను రాష్ట్ర ప్రభుత్వం 2009లో కేటాయించింది. అక్కడ నిర్మాణాలు రాకపోవడంతో స్థానికంగా నాయకులుగా చెలామణి అవుతున్నవారి కన్ను ఈ భూమిపై పడింది. అంతే ఎవరికి వారు ప్రహరీలు నిర్మించుకుని షెడ్డులు వేసి ఆక్రమణలకు పాల్పడితే స్థానికుల నుంచి హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదులందాయి. హైడ్రా అదికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సర్వేచేసి ప్రభుత్వ భూమి అని నిర్ధారించుకున్న తర్వాత హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆక్రమణలు తొలగించి వెంటనే ప్రభుత్వభూమి పేరిట బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఆక్రమణలను అధికారులు నేలమట్టం చేశారు. అక్కడ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి హైడ్రా కాపాడిన ప్రభుత్వ భూమిగా బోర్డులు పెట్టారు.