బంగ్లా దేశస్థులకు నకిలీ బర్త్ సర్టిఫికెట్లు. ఆరుగురు సభ్యుల ముఠా అరెస్ట్
హైదరాబాద్ పాతబస్తీ మలక్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ బర్త్ సర్టిఫికెట్లు తయారీ చేస్తున్న ముఠా గుట్టును సెంట్రల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. అక్రమ వలసదారులైన బంగ్లా దేశస్తులకు నకిలీబర్త్ సర్టిఫికెట్లు తయారీ చేసి ఇస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులలో ఇద్దరు బంగ్లా దేశీయులు మహ్మద్ హసిబుల్, రోహన్ షా ఉన్నట్లు మలక్ పేట పోలీసులు తెలిపారు. నిందితులు స్థానికంగా ఉంటూ భారత్ సరిహద్దులు దాటి కోల్ కతా నుండి హైదరాబాద్ చేరుకుంటున్న బంగ్లాదేశస్తులకు నకిలీ బర్త్ సెర్టిఫికెట్లు తయారీ చేస్తున్నట్లు గుర్తించారు. బర్త్ సర్టిఫికెట్ల దందా ముఠాను అదుపులో తీసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు ముఠాలో మరికొందరు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎంత మందికి నకిలీ బర్త్ సర్టిఫికెట్లను జారీ చేశారనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.