ఊసరవెల్లి కాదు.. ఒకటే కలర్..!
- అసలు రంగు బయటపెట్టిన ఉండవల్లి
- పీఎస్‌ఆర్ అరెస్టును తప్పుబట్టిన ఉండవల్లి
- సోషల్ మీడియాలో ఆడుకుంటున్న నెటిజన్స్
- జగన్‌పై లోలోపల సాఫ్ట్‌కార్నర్
- జైల్లో పీఎస్‌ఆర్‌ను పరామర్శించిన ఉండవల్లి
- జెత్వానీ కేసులో పెద్ద తలకాయల్ని కాపాడేందుకే రాయబారం..?
ఏపీలో అపర మేధావిగా చెప్పుకునే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అసలు రంగు బయటపడింది. నిన్నమొన్నటిదాకా తనకు ఏ పార్టీతో సంబంధం లేదని.. తాను చచ్చేవరకు కాంగ్రెస్‌వాదిగానే ఉంటానని.. అసలు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానంటూ నీతులు చెప్పిన ఈ మాజీ ఎంపీ.. పీఎస్‌ఆర్ ఆంజనేయుల అరెస్ట్‌ను ఖండించి తన అసలు రూపం బయటపెట్టుకున్నారంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ ఓ రేంజ్‌లో కామెంట్స్ చేస్తున్నారు. పైకి జగన్ తప్పుచేశాడని చెబుతున్నా.. లోలోపల మాత్రం ఉండవల్లికి ఎక్కడో మాజీ సీఎంపై సాఫ్ట్ కార్నర్ ఉండేది. అందుకే వైసీపీ పాలనపై విమర్శలు చేస్తూనే.. సంక్షేమ పథకాలు బాగున్నాయంటూ మెచ్చుకునేవారు. జగన్‌తో ఆయన ఇంటర్నల్ టాక్స్ నడిచేవనే ప్రచారం కూడా అప్పట్లో జరిగింది. కానీ.. ఉండవల్లి మాత్రం ఎక్కడా బయటపడకుండా జాగ్రత్తగా వ్యవహరించారు. కానీ.. ఇప్పుడు పీఎస్‌ఆర్ ఆంజనేయుల కోసం రాయబారానికి దిగి తన అసలు రూపాన్ని జనాలకు చూపెట్టారనే టాక్ వినిపిస్తోంది. జైలులో పీఎస్ఆర్ ఆంజనేయులను ఉండవల్లి అరుణ్ కుమార్ పరామర్శించారు. ఈ నేపథ్యంలో కేసు పూర్వాపరాలపై అధ్యయనం చేస్తున్నానని.. డీజీ స్థాయి అధికారిని అరెస్టు చేయడం ఆషామాషీ విషయం కాదన్నారు. ఇది పెద్ద చర్చకు దారి తీస్తుందని చెప్పారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి అనుకూలంగా ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. వైసీపీ హయాంలో సినీనటి కాదంబరి జెత్వానీతోపాటు ఆమె కుటుంబసభ్యులపై ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు మేరకు ఆమెపై ఛీటింగ్ కేసు పెట్టారు. అయితే ముంబైలో ఓ పారిశ్రామిక వేత్తను కాపాడేందుకే ఆమెపై కేసు పెట్టారనే ఆరోపణలున్నాయి. వైసీపీ ఓడిపోయి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కాదంబరి జెత్వానీ.. తనను వేధించారంటూ కొంతమంది పోలీస్ అధికారులపై ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అందులో పాలుపంచుకున్న పలువురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసి విచారణ జరుపుతోంది.
మరోవైపు కాదంబరి జెత్వానీ కేసులో కీలక సూత్రధారి పీఎస్ఆర్ ఆంజనేయులేనని పోలీసులు చెబుతున్నారు. ఈయన ఆదేశాల మేరకే కాంతిరాణా టాటా, విశాళ్‌గున్నీ నడుచుకున్నారని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో ఈ కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులును పోలీసులు అరెస్టు చేసి విజయవాడ జైలుకు తరలించారు. అయితే డీజీ స్థాయి అధికారిని అరెస్టు చేయడంపై ఉండవల్లి అరుణ్ కుమార్ ఆక్షేపణ వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో భాగంగా పోలీసులు ఏదైనా చర్య తీసుకుంటే.. అది కుట్ర అని భావించి వాళ్లను అరెస్టు చేయడం సరికాదన్నారు. ఇలా చర్యలు తీసుకోవాల్సి వస్తే పోలీసుసందరినీ లోపల వేయాల్సి వస్తుందన్నారు. పీఎస్ఆర్‌ను జైలులో కలిసినప్పుడు ఆయన కులాసాగానే ఉన్నారని.. తనపై ఇంకా కేసులు నమోదవుతాయని చెప్పారని ఉండవల్లి వివరించారు. పాతకేసు విచారణ పెండింగులో ఉండగానే దాన్ని సాకుగా చూపి కొత్త కేసు నమోదు చేయడం, డీజీ స్థాయి పోలీసు అధికారులను అరెస్టు చేయడం కక్షసాధింపుగానే పరిగణించాల్సి ఉంటుందని చెప్పారు. ఐతే.. ఉండవల్లి కామెంట్స్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పీఎస్‌ఆర్‌ది, ఉండవల్లి ఒకటే సామాజికవర్గం కావడంతోనే ఆయన ఇలా అరెస్టును తప్పుబడుతున్నారని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. గతంలో కూడా చాలామంది ఐపీఎస్‌లు, ఐఏఎస్‌లు అరెస్ట్ అయ్యారని.. అప్పుడు ఉండవల్లి ఆ అరెస్టుల్ని ఎందుకు ఖండించలేదని ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో తెరవెనుక ఉన్న పెద్ద తలకాయల్ని కాపాడడానికే పీఎస్‌ఆర్‌తో ఉండవల్లి రాయబారం నడిపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.