నాని దెబ్బ.. చిన్ని అబ్బ..!

By Ravi
On
నాని దెబ్బ.. చిన్ని అబ్బ..!

- ఏపీ పాలిటిక్స్‌లో హీట్‌ పుట్టిస్తున్న కేశినేని బ్రదర్స్‌
- సోదరుడు చిన్నీపై నానీ అవినీతి అరోపణలు
- సీఎం చంద్రబాబుకు నానీ వరుస లేఖలు
- ఉర్సాతోపాటు లిక్కర్‌స్కామ్‌లో చిన్ని హస్తముందని ఆరోపణలు
- రాజ్‌ కసిరెడ్డితోపాటు దిలీప్‌ పైలాతో లింకులున్నాయని లేఖ 
- నానీ ఆరోపణలతో ఇరుకునపడ్డ ఎంపీ చిన్ని

బెజవాడతోపాటు హోల్‌ ఏపీలో హీట్‌ పుట్టిస్తున్నారు కేశినేని బ్రదర్స్‌. టీడీపీలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన కేశినేని నాని.. ఇప్పుడా పార్టీని ఇరుకున పెట్టడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. తన సోదరుడు కేశినేని శివనాథ్‌ అలియాస్‌ చిన్నిపై అనేక ఆరోపణలు చేస్తున్నారు. అంతటితో ఆగకుండా సీఎం చంద్రబాబుకు లేఖల మీద లేఖలు రాస్తూ.. టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. 2014 నుంచి 2024 వరకు వరుసగా పదేళ్లపాటు ఎంపీగా కేశినేని నాని పనిచేశారు. ఐతే.. గత ఎన్నికల్లో నాని వైసీపీ నుంచి పోటీ చేసి.. చిన్ని చేతిలో ఓడిపోయారు. నాని ప్రత్యర్థులతో చేతులు కలిపిన చిన్ని అనూహ్యంగా ఎంపి అయ్యారు. అయితే తాను తన సోదరుడు మూలంగానే టీడీపీకి దూరమయ్యానని.. ఎంపీ పదవిని కోల్పోయానని నాని తీవ్ర ఆవేదనతో ఉన్నారు. అందుకే టీడీపీ నాయకత్వానికి వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు. కేశినేని చిన్ని అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. మొన్న విశాఖలో ఉర్సా అనే ఐటీ సంస్థకు భూముల కేటాయింపు వెనుక.. కేశినేని శివనాథ్ ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడు తాజాగా మద్యం కుంభకోణం నిందితులతో చిన్నికి సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు.

ఏపీలో మద్యం కుంభకోణం ప్రస్తతం హాట్‌టాపిక్‌ మారింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీ అవినీతి జరిగిందని కూటమి ప్రభుత్వం భావించింది. దానిపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. తాజాగా ఏర్పాటైన సిట్‌ ముమ్మర విచారణ ప్రారంభించింది. ఈ మద్యం కుంభకోణంలో రాజ్ కసిరెడ్డి సూత్రధారి అని తేలిపోయింది. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే ఆయన ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. మరోవైపు ఈ కేసులో కీలక వ్యక్తుల అరెస్టు ఉంటుందని ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే కేశినేని చిన్నీకి నిందితులతో సంబంధాలు ఉన్నాయని ఆయన సోదరుడు స్వయంగా ఆరోపించడం సంచలనంగా మారింది.

తాజాగా మాజీ ఎంపీ కేశినేని నాని సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. సోషల్ మీడియాలో ట్వీట్ పెట్టారు. మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన రాజ్ కసిరెడ్డి, ఆయన సన్నిహితుడు దిలీప్ పైలాతో చిన్నికి సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డి, ఎంపీ కేశినేని చిన్ని, ఆయన భార్య జానకి లక్ష్మితో కలిసి ప్రైడ్ ఇన్ఫ్రా కాన్ ఎల్ఎల్‌బి అనే సంస్థలో భాగస్వాములుగా ఉన్నారని.. హైదరాబాదులోని జూబ్లీహిల్స్ ప్లాట్ నెంబర్ 9, సర్వే నంబర్ 403 చిరునామాతో ఈ సంస్థ నమోదయిందని నాని చెప్పారు. అలాగే రాజ్ కసిరెడ్డి, దిలీప్ పైలా నిర్వహిస్తున్న ఇషాన్వి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఇదే చిరునామాతో కార్యకలాపాలు సాగిస్తోందని తెలిపారు. ఈ రెండు సంస్థలు ఒకే అధికారిక మెయిల్ ఐడీని వినియోగిస్తున్నాయని.. కేశినేని చిన్ని మద్యం కుంభకోణంతో సంబంధం ఉన్న నిధులను వినియోగించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారన్నది నాని చేస్తున్న ఆరోపణ. దీనిపైనే సమగ్ర విచారణ చేపట్టాలని సీఎం చంద్రబాబుకు ఆయన విజ్ఞప్తి చేశారు. నానీ ఆరోపణలతో చిన్నీ ఇరుకునపడ్డారు. ఉర్సాతోపాటు లిక్కర్‌ స్కామ్‌తో కూడా తనకు ఎలాంటి సంబంధం లేదని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి దీనిపై టీడీపీ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Related Posts

Advertisement

Latest News

కేంద్రం నిర్ణయంతో పెరిగిన రేవంత్‌ పరపతి..! కేంద్రం నిర్ణయంతో పెరిగిన రేవంత్‌ పరపతి..!
- కులగణన చేయాలని కేంద్రం నిర్ణయం- ఇప్పటికే తెలంగాణలో కులగణన పూర్తి- కేంద్రం నిర్ణయంతో దేశవ్యాప్తంగా మార్మోగుతున్న రేవంత్‌ పేరు- కులగణనలో తెలంగాణ మోడల్‌ తీసుకోవాలని విజ్ఞప్తి-...
సమ్మె వద్దు.. ఆర్టీసీ యాజమాన్యం లేఖ
ఆర్టీసీ ఆసుప‌త్రిలో డీఎన్‌బీ పీజీ మెడిక‌ల్ కోర్సులు
పలుచోట్ల ఎక్సైజ్ దాడి.. గంజాయి, డ్రగ్స్ స్వాదీనం
ఊసరవెల్లి కాదు.. ఒకటే కలర్‌..!
కక్షపూరితంగానే ఎక్సైజ్ సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్ ని ఏసీబీకి పట్టించారు
నాని దెబ్బ.. చిన్ని అబ్బ..!