సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో అపశృతి.. గోడకూలి ఎనిమిది మంది భక్తులు మృతి
సింహాచలం విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ పడడంతో ఎనిమిది మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత, సింహాచలంలో భారీ వర్షం కురిసింది. దీంతో సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్తే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ.300 టికెట్ క్యూలైన్లపై సిమెంట్ గోడ కూలింది. దీంతో శిధిలాల కింద పలువురు చిక్కుకున్నారు. వెంటనే ఎన్టీఆర్ఎస్ సిబ్బంది అధికారులు సహాయక చర్యలు. చేపట్టారు. హోంమంత్రి సంగలపూడి అనిత, విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్వి ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఆరు మృతదేహాలను విశాఖ కేజ్ హెచ్ ఆసుపత్రికి తరలించారు. మరో రెండు మృతదేహాలను శిథిలాల కింద గుర్తించారు.
నిజరూపంలో దర్శనమిస్తున్న అప్పన్న...
వరహా లక్ష్మీ నరసింహస్వామి భక్తులకు నిజరూపం లో దర్శనమిస్తున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు ఇప్పటికే భారీ ఎత్తున సింహాచలం కి పోటెత్తారు. వేకువజామున ఒంటిగంటకు స్వామిచారిని సుప్రభాత సేవతో మేల్కొలిపారు అనంతరం స్వామివారి వేహంపై ఉన్న చందనాన్ని వెండి బొరిగెలలో అత్యంత సున్నితంగా వేరుచేశారు. నిజరూపంలోకి వచ్చిన స్వామికి విశేష అభిషేకాలు నిర్వహించారు. వైదిక కార్యక్రమాల అనంతరం ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు, ఆయన కుటుంబ సభ్యులకు నిజరూప దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా వారు. స్వామివారికి తొలి చందనాన్ని సమర్పించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరపున రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, తితిదే పట్టు, వస్త్రాలు సమర్పించారు. ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ప్రొటోకాల్, అంతరాలయ దర్శనాలను ఏర్పాటు చేశారు.