యాదాద్రి కాటపల్లి ఎక్స్ ప్లోజివ్ కంపెనీలో పేలుడు.. నలుగురికి గాయాలు
యాదాద్రి మోటకొండూరు మండలం కాటపల్లిలో ప్రమాదం జరిగింది. స్థానిక ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్ లిమిటెడ్ కంపెనీలో గల బిల్డింగ్ నెంబర్ 18ఏ మిక్స్ హౌస్ లో పేలుడు జరిగి భవనం మొత్తం నేలమట్టం అయ్యింది. ఆ సమయంలో ప్రొడక్షన్ హౌస్ లో ఆరుగురు కార్మికులు ఉన్నారు. గాయపడ్డ నలుగురు చాడ గ్రామానికి చెందిన శ్రీకాంత్, పులిగిల్ల ప్రాంతానికి చెందిన బుగ్గ లింగస్వామి, ఆత్మకూరుకి చెందిన నరేష్, కుందుకూరి గ్రామానికి చెందిన మహేందర్ హుటాహుటిన అంబులెన్స్ లో హైదరాబాద్యశోద ఆస్పత్రికి తరలించారు. కాటపల్లి గ్రామానికి చెందిన సందీప్, మోటకొండూరు ప్రాంతానికి చెందిన దేవి చరణ్ ఆచూకీ లభ్యం కాలేదు. ఆ ఇద్దరు శిధిలాల కింద ఉన్నట్లు తోటి ఉద్యోగులు అనుమానిస్తున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కంపెనీ వద్దకు చేరుకొని శిధిలాలను తొలగించే పనిలో పడ్డారు. గాయపడిన వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే స్థానికులు ఆందోళనకు దిగారు. వెంటనే ఎక్స్ ప్లోజివ్ కంపెనీని ఇక్కడి నుండి తొలగించాలని ధర్నా చేశారు.