వరి ధాన్యం రైతుల అవస్థలు..
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి - రైతుల డిమాండ్.
కేంద్రాన్ని సబ్ కలెక్టర్ పరిశీలించిన కొద్దిసేపటికే తడిసి ముద్దయిన ధాన్యం
వికారాబాద్ TPN : రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద కురిసిన అకాల వర్షానికి వరి ధాన్యం తడిసి ముద్దయింది .దీంతో రైతులకు అవస్థలు తప్ప లేదు. కొనుగోలు కేంద్రానికి తీసుకొని వచ్చిన తడిసి ముద్దయిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. మరోవైపు కేంద్రాన్ని పరిశీలించిన సబ్ కలెక్టర్ వెళ్లిన కొద్దిసేపటికి ఇలా జరగడం పై రైతన్నలు విచారం వ్యక్తం చేశారు .ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గం యాలాల మండల కేంద్రంలో చోటు చేసుకుంది.
తాండూర్ నియోజకవర్గం యాలాల మండల కేంద్రంలో ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను ఏర్పాటు చేశారు. ఇటీవల ఐకెపి ఆధ్వర్యంలోని వరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రారంభించారు. అయితే వరి ధాన్యం కేంద్రం వద్ద ఏ విధంగా ధాన్యం కొనుగోలు, ఏర్పాట్లను మంగళవారం తాండూర్ సబ్ కలెక్టర్ ఉమాశంకర్ పరిశీలించారు. పరిశీలించిన కొద్దిసేపటికే అకాల వర్షం పడటంతో రైతులు తీసుకొని వచ్చిన వరి ధాన్యమంతా తడిసి ముద్దయింది .దీంతో రైతులు వరి ధాన్యం పై కప్పే తాడుపత్రి లేక ఇబ్బందికి గురయ్యారు. నీటి నిల్వ ను తొలగించిన కూడా వరి ధాన్యం నీటిలో తడిసిపోయింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తాము కేంద్రానికి తీసుకొని వచ్చిన తర్వాత పడిన వర్షానికి వరి ధాన్యం తడిసి ముద్దయిందని విచారణ వ్యక్తం చేశారు. అధికారులు గుర్తించి తమ ధాన్యాన్ని తడిసిన కూడా కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు కలెక్టర్ కూడా ఈ కేంద్రాన్ని సందర్శించారని ఆయన ఉన్నప్పుడు వర్షం పడి ఉంటే అన్ని విషయాలు తెలిసేదని ఆవేదనను విచార రూపంలో తెలియజేశారు.