ఏఐవైఎఫ్ జాతీయ మహాసభల వాల్‌పోస్టర్ ఆవిష్కరణ..!
టెక్కలి TPN : అఖిల భారత యువజన సమాఖ్య 17వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మొజ్జాడ యుగంధర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా టెక్కలిలో జాతీయ మహాసభల వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మే నెల 15 నుంచి 18 వరకు తిరుపతి నగరంలో జాతీయ మహాసభలను నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కరించడం కోసం అఖిల భారత యువజన సమాఖ్య అలుపెరగని పోరాటం చేస్తోందని.. భారతదేశంలో 18 సంవత్సరాల నిండిన యువతీయువకులకు ఓటు హక్కు కల్పించడంలో ఏఐవైఎఫ్ పోరాటం చేసిందని గుర్తు చేశారు. భగత్ సింగ్ నేషనల్ గ్యారెంటీ ఎంప్లాయ్‌మెంట్ యాక్ట్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగ యువతను ఆదుకోవాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి పది నెలలు కావస్తున్న నిరుద్యోగ భృతి ఇంతవరకు ఇవ్వలేదని.. తక్షణమే నిరుద్యోగ భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. తిరుపతి వేదికగా జరుగుతున్న జాతీయ మహాసభలలో అనేక సమస్యలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణకు పిలుపునివ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్న శ్రీనివాస్, ఏఐవైఎఫ్ నాయకులు కిరణ్, గోవింద్, మోహన్, నితిన్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు