సైబర్ నేరాలపై దక్షిణాది రాష్ట్రాల డీజీపీల సమన్వయ సమావేశం
దక్షిణాది రాష్ట్రాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ల మరియు వారికి ప్రాతినిధ్యం వహించిన పోలీసు అధికారుల ప్రాంతీయ త్రైమాసిక సమన్వయ సమావేశాన్ని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో బుధవారం నాడు నిర్వహించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, అండమాన్ & నికోబార్ దీవులు మరియు పుదుచ్చేరి రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమన్వయ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్, డైరెక్టర్ టి జి సి ఎస్ బి శ్రీమతి శిఖా గోయల్ తదితరులు పాల్గొన్నారు. సైబర్ నేరాలు మరియు సైబర్ భద్రత రంగంలో దక్షిణాది రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం, సైబర్ నేరాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది. సైబర్ నేరాలు నానాటికి పెరుగుతున్నందున అంతర్-రాష్ట్ర సమన్వయం, అంతర్జాతీయ సహకారం, బ్యాంకింగ్ మరియు టెలికాం రంగాలతో సమన్వయం, సైబర్ శిక్షణ అవసరమని సమావేశం అభిప్రాయపడింది. ప్రజల అవగాహన పెంచడం ద్వారా సైబర్ నేరాలను నియంత్రించాలని దీనికోసం రాష్ట్రాల మధ్య సమన్వయం ఉండాలని అధికారులు చర్చించారు. సైబర్ బాధితులకు సకాలంలో న్యాయం మరియు మద్దతు అందించడానికి చట్టపరమైన సమస్యలు మరియు విధానపరమైన జాప్యాలపై అధికారులు చర్చించారు. పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు జాతీయ స్థాయిలో బ్యాంకింగ్, టెలి కమ్యూనికేషన్ తదితర శాఖలతో సమన్వయం చేయాలని ఆకాంక్షించారు. సైబర్ నేరాలను సులభతరం చేయడానికి క్రిప్టోకరెన్సీని దుర్వినియోగం చేయడం గురించి పెరుగుతున్న ఆందోళన గురించి కూడా ప్రస్తావనకు వచ్చింది. ఈ రకమైన నేరాలలో పాల్గొన్న దుండగులను పట్టుకోవడానికి కొత్త దర్యాప్తు పద్ధతులను పాటించాల్సి ఉందన్నారు. సమావేశానికి తెలంగాణ రాష్ట్ర డిజిపి డాక్టర్ జితేందర్ అధ్యక్షత వహించారు. సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి దక్షిణాది రాష్ట్రాల సమన్వయంతో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉందన్నారు. సైబర్ భద్రత ను బలోపేతం చేయాలన్న అభిప్రాయపడ్డారు. సైబర్ నేరాల నుండి బాధితులను రక్షించడానికి సమిష్టిగా నైపుణ్యాన్ని ఉపయోగించుకోవాలన్నారు. మన ఉమ్మడి ప్రయత్నాల ద్వారా మన ప్రాంతానికి సురక్షితమైన వ్యవస్థను ఏర్పరచుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. సమావేశంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శ్రీమతి శిఖా గోయల్ మాట్లాడుతూ...
సైబర్ నేరాలను అధికట్టేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక పరిజ్ఞానాలను వినియోగించుకోవలసి ఉందని అభిప్రాయపడ్డారు. దక్షిణాది రాష్ట్రాల పోలీస్ అధికారులు ఈ దిశగా కార్యాచరణ ప్రణాళికను తయారు చేసుకోవాల్సి ఉందన్నారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను హోం మంత్రిత్వ శాఖ సూచించాలని కోరారు. ఐ ఫోర్ సి, సీఈవో శ్రీ రాజేష్ కుమార్ మాట్లాడుతూ... సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ ఓ పి) ని రూపొందిస్తున్నామన్నారు. రాష్ట్రాలకు అవసరమైన అత్యాధునిక పరికరాలను మరియు నైపుణ్యాన్ని అందించడానికి ఐ ఫోర్ సి కట్టుబడి ఉంది అని ఆయన పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలలోని సైబర్ విభాగాల మధ్య సహకారాన్ని మెరుగుపరచడానికి, వేగవంతమైన దర్యాప్తును అందించడానికి, నిఘా సమాచారాన్ని పంచుకోవడానికి, నిందితులను పట్టుకోవడానికి, జాప్యాలను తగ్గించడానికి మరియు సైబర్ బాధితులకు త్వరిత న్యాయం అందించడానికి ఒక ప్రాంతీయ సమన్వయ విభాగాన్ని ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల నుండి సీనియర్ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.తమిళనాడు సైబర్ క్రైమ్ అడిషనల్ డీజీపీ శ్రీ సందీప్ మిట్టల్ , కేరళ రాష్ట్ర సైబర్ క్రైమ్ అడిషనల్ డీజీపీ శ్రీ. హెచ్. వెంకటేష్ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఈగల్ ఐ జి పి శ్రీ ఏ. రవి కృష్ణ , అండమాన్ నికోబార్ దీవుల సైబర్ క్రైమ్ ఎస్పీ శ్రీ మనోజ్ కె మీనా , కర్ణాటక రాష్ట్ర సిఐడి ఎస్పి శ్రీ అనూప్ శెట్టి , పుదుచ్చేరి రాష్ట్ర సైబర్ క్రైమ్ ఎస్పీ శ్రీ ఎన్ .చైతన్య , తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పి శ్రీ హర్షవర్ధన్, శ్రీ దేవేందర్ లు మరియు శ్రీ దేవేందర్ లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.