నగరంలో డ్రగ్స్ దందా..!
- రూ. 2.75 లక్షల డ్రగ్స్ పట్టివేత..
- రూ.. లక్ష నగదు, కారు స్వాధీనం.
- ఇద్దరు వ్యక్తుల అరెస్ట్
హైదరాబాద్ నగరంలో పోలీసులు ఎంతగా నిఘా పెట్టినా డ్రగ్స్ వ్యాపారం మాత్రం ఆగడం లేదు. తాజాగా సిటీలో డ్రగ్స్ అమ్మకాలు సాగిస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బేగంపేటలో నివాసం ఉంటున్న తేజస్ అనే వ్యక్తి డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. తేజస్‌కు అమెరికా పౌరసత్వం కూడా ఉంది. గతంలో అమెరికా నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత ముంబైలో ఉద్యోగం చేసేవాడు. అక్కడ డ్రగ్స్ పెడ్లర్స్‌తో పరిచయాలు ఏర్పడ్డాయి. అక్కడే డ్రగ్స్ అలవాటు పడ్డాడు. తర్వాత డ్రగ్స్ తీసుకునే వ్యక్తి నుంచి డ్రగ్స్ అమ్మే స్థాయికి చేరాడు. ముంబై నుంచి హైదరాబాద్ వచ్చి రీగాక్స్ అనే కంపెనీలో ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నాడు. తేజస్‌తోపాటు సోహైల్ అహ్మద్ అనే వ్యక్తి కూడా డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు. వీళ్లిద్దరు కలిసి డ్రగ్స్ అమ్మకాలు సాగిస్తున్నారు. 15 రోజులకోసారి ముంబై వెళ్లి.. చెరస్, ఎల్ఎస్డీ బ్లాస్ట్, ఓజీ కుష్ లాంటి డ్రగ్స్‌ను తీసుకువచ్చి సన్‌సిటీ ప్రాంతంలో అమ్మకాలు జరిపేవారు. ఈ సమాచారం అందుకున్న ఎస్టీఎఫ్ టీమ్ లీడర్ అంజిరెడ్డి తన సిబ్బందితో కలిసి ఇద్దరిని సన్ సిటీ ప్రాంతంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీళ్ల నుంచి 21 గ్రాముల ఓజీ కుష్, 32.5 గ్రాముల చెరస్, 56 గ్రాముల ఎల్‌ఎస్డీ బ్లాస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్‌తోపాటు నిందితుల నుంచి లక్ష రూపాయల నగదు, కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న డ్రగ్స్ విలువ రూ. 2.75 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.