రాష్ట్ర అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు ఏకగ్రీవ ఆమోదం, రాయవరంలో విజయోత్సవాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం సందర్భంగా, రాయవరంలో మిన్నటిన విజయోత్సవాలు నిర్వహించబడ్డాయి. 31 సంవత్సరాల సుధీర్ఘ వర్గీకరణ పోరాటం విజయం సాధించిన సందర్భంగా, రాయవరంలో ఉన్న మాదిగ పేటలో ఎమ్మార్పీఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. చిన్నా పెద్దా అందరూ రోడ్లపైకి వచ్చి వేడుకలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా, వర్గీకరణ పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తులను గౌరవిస్తూ, రాజ్యాంగ నిర్మాత డా. బి. ఆర్. అంబేద్కర్, మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మరియు పద్మశ్రీ మందా కృష్ణ మాదిగ చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ధూళి జయరాజు మాట్లాడుతూ, "దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఎస్సీ వర్గీకరణ కోసం కమిటీ ఏర్పాటు చేసి మాదిగ జాతికి మేలు చేయాలని ప్రయత్నించారు. అయితే, వారి వారసుడు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గీకరణ విషయంలో ద్వంద్వ వైఖరి పాటించి మాకు అన్యాయం చేశారని" అన్నారు.
అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ఎప్పటినుంచి, ఎమ్మార్పీఎస్ ఉద్యమం ప్రారంభం నుంచే వర్గీకరణ అమలు జరిగే వరకు మాట నిలబెట్టుకున్నారని, ఈ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఆ తర్వాత, ఎమ్మార్పీఎస్ జెండాను ఆవిష్కరించి, ర్యాలీగా బయలుదేరి, రాయవరం మండల ప్రభుత్వ కార్యాలయాల సముదాయంలో ఉన్న డా. బీఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, పాలాభిషేకం చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చందమళ్ళ రామకృష్ణ, ఎంఈఎఫ్ సభ్యులు కటకం అబ్బులు, మాదిగ సామాజిక వర్గ పెద్దలు మందపల్లి నగేష్, చంద్రమళ్ళ యాకోబు, పెదపాటి శాంతరాజు, మందపల్లి కొండలరావు, ఎమ్మార్పీఎస్ గ్రామ, మండల కమిటీ సభ్యులు, యువకులు పాల్గొన్నారు.