యువతకు ఉద్యోగ అవకాశాలు కొల్లేరు, పోలవరం ప్రాజెక్ట్ లకు ప్రతిపాదనలు
అధికారులకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆదేశం
ఏలూరు : యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రాధాన్యతగా తీసుకోవాలని ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. స్థానిక కలెక్టరేట్ లోని గోదావరి సమావేశపు హాలులో శనివారం జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటాపద్మశ్రీ, జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, సొంగా రోషన్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు కావలసిన భూమికి అవసరమైన ల్యాండ్ బ్యాంకు వివరాలు అధికారులు సేకరించారన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ, జాబ్ మేళాలు నిర్వహించి, ఎక్కువమంది యువతకు ఉద్యోగ అవకాశాలు కలిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. 2026, మార్చి లోగా జిల్లాలోని 7వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రతీ నెల జాబ్ మేళాలు నిర్వహించాలన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అర్హులైన ప్రతీ ఒక్కరికీ అందేలా చూడాలన్నారు. జల్ జీవన్ మిషన్ కార్యక్రమంలో జిల్లాలో ప్రతీ ఇంటికి కుళాయి కనెక్షన్ ఇవ్వాలన్నారు. ఏలూరు, దెందులూరు నియోజకవర్గాలకు విజయవాడ కృష్ణా కాల్వ నుండి మురుగునీరు త్రాగునీరుగా సరఫరా అవుతుందని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా దెందులూరు నియోజకవర్గంలోని పోలవరం ప్రాజెక్ట్ కుడి ప్రధాన కాల్వ నుండి పైప్ లైన్ ఏర్పాటుచేసి, స్వచ్ఛమైన త్రాగునీరు అందించేలా డిపిఆర్ తో ప్రతిపాదనలు సిద్ధం చేయాలనీ ఆర్ డబ్ల్యూఎస్ అధికారులను ఎంపీ ఆదేశించారు. రానున్న వేసవిలో జిల్లాలో ఎక్కడా త్రాగునీటి సమస్య తెలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులకు సూచించారు. జిల్లాలో మంజూరైన రోడ్ల నిర్మాణ పనులను వెంటనే పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ, మండలాలలో చేపట్టే అభివృద్ధి పనుల వివరాలను స్థానిక ఎమ్మెల్యే లకు తెలియజేసి, వారి సూచనలను కూడా పరిగణనలోనికి తీసుకోవాలని ఎంపీ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని కొల్లేరు, పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్ధేందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలన్నారు. అనంతరం జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశంను ఉదేశించి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి,దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్, చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ అధికారుల అలసత్వంపై మండిపడ్డారు.
సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ కె. భీమేశ్వరరావు, డిఆర్డిఏ పీడీ ఆర్. విజయరాజు, ఇరిగేషన్, ఆర్ డబ్ల్యూ ఎస్ సూపరింటెండింగ్ ఇంజినీర్లు నాగార్జునరావు, త్రినాధ్ బాబు, వ్యవసాశాఖాధికారి హబీబ్ భాష, ఉద్యానవన శాఖ డిడి రామ్మోహన్, డిఎంహెచ్ ఓ డా. మాలిని, డిఈఓ వెంకటలక్ష్మమ్మ, మైక్రో ఇరిగేషన్ పీడీ రవికుమార్, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శ్రీలక్ష్మి, ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ ఏ. భానుప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.