కొల్లేరు చిక్కుముడి పరిష్కరిస్తాం
-- ఏలూరు ఎంపి మహేష్ వెల్లడి
ఏలూరు : కొల్లేరు చిక్కుముడిని పరిష్కరించేందుకు కృషిచేస్తానని ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ అన్నారు. స్ధానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో శనివారం జరిగిన దిశ సమావేశం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. కొల్లేరుకు సంబంధించి అంశం సుప్రీం కోర్టులో నడుస్తున్నదన్నారు. ఈ సున్నితమైన సమస్య పరిష్కరించడానికి చాలా సమయం పట్టేటట్లు కనబడుతున్నప్పటికీ నూరుశాతం పరిష్కరించేందుకు కృషిచేస్తానన్నారు. ఏప్రిల్ 10వ తేదీన కనీసం వెయ్యిమందికి ఉపాధికల్పించేలా మెగా జాబ్ మేళా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. జిల్లాలో ఇప్పటికే పలురహదారులు అభివృద్ధి పనులు చేయడం జరిగిందని, పూర్తిగా దెబ్బతిన్న రహదారుల అభివృద్ధి చేసే పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. సమావేశంలో జెడ్పి చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్, జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి పాల్గొన్నారు.