సుగాలి ప్రీతీ కేసులో మౌనమెందుకు పవన్..?
- ఎన్నికల్లో సుగాలి ప్రీతీ కేసుపై పవన్ ప్రచారం
- అధికారంలోకి వస్తే కేసును పరిష్కరిస్తామని హామీ
- 10 నెలలు కావొస్తున్న పట్టించుకోని డిప్యూటీ సీఎం
- ఈ కేసులో పూర్తిగా చేతులెత్తేసిన సీబీఐ
- పవన్‌పై నెట్టింట్లో ఫైర్ అవుతున్న నెటిజన్స్
- ప్రభుత్వాలు మారినా తేలని అసలు నిందితులు
- కేసు అటకెక్కినట్లేనని సోషల్ మీడియాలో ప్రచారం
- చొరవ చూపకుంటే రాజకీయ దోషిగా నిలబడడం ఖాయం
సుగాలి ప్రీతీ కేసుపై సోషల్ మీడియాలో మరోసారి రచ్చ మొదలైంది. ఈ కేసుకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్‌పై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. ప్రశ్నించేందుకే పార్టీ పెట్టారన్న పవన్.. సుగాలీ ప్రీతీ కేసును ఎందుకు గాలికొదిలేశారని ప్రశ్నిస్తున్నారు. ఈ కేసు లైమ్‌లైట్‌లోకి రావడానికి కారణమే పవన్. సుగాలి ప్రీతికి న్యాయం చేయడంలో గత ప్రభుత్వం విఫలమైందని ఊరూరా తిరిగి మరీ ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తాము టేక్ అప్ చేసే మొట్టమొదటి కేసు ఇదేనని బల్లగుద్ది మరీ చెప్పారు. కానీ.. ఆ మాటలన్నీ నీటిమూటలుగానే మిగిలిపోయాయి. అధికారం అందుకుని 10 నెలలు గడుస్తున్నా.. ఇప్పటికీ ఆ కేసు ఊసే ఎత్తలేదు జనసేన అధినేత. జనాలు కష్టంలో ఉంటే చూడలేను అని చెప్పుకునే జనసేనాని.. ఈ కేసుపై ఎందుకు మౌనంగా ఉన్నారు. చేతిలో పవర్ ఉంచుకుని కూడా ఈ కేసులో ఎందుకు బాధితులకు న్యాయం చేయలేకపోతున్నారు..? ఈ కేసులో నిందితులు టీడీపీకి సంబంధించిన వారు కావడమే కారణమా..? ఇదే పవన్‌ను పైకి మాట్లాడనీయకుండా చేస్తోందా..? మరి ఇదే విషయం గతంలో పవన్‌కు తెలియదా..?
అప్పుడెప్పుడో సినీ నటి ప్రత్యూష కేసు గుర్తుందా..? ఇప్పటికీ ఆ కేసులో నిందితులెవరో తేల లేదు. తేలుతుందనే నమ్మకం కూడా లేదు. ఇక ఆయేషా మీరా కేసు కూడా అలానే మరుగున పడిపోయింది. ఇప్పుడు సుగాలీ ప్రీతి కేసు. ఈ కేసు కూడా అలానే నిజానిజాలు బయటికిరాకుండా అటకెక్కుతుందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పుడో టీడీపీ హయాంలో జరిగిన ఈ దారుణ ఘటనలో ఇప్పటికీ నిందితులు ఎవరో తెలిసి కూడా కేసులు పెట్టలేని దురవస్థలో ప్రభుత్వాలు ఉన్నాయంటే.. ఇంతకంటే చేతకానితనం ఇకేముంటుంది..? 2017లో సుగాలీ ప్రీతి దారుణ హత్యకు గురైంది. తర్వాత రెండేళ్లు టీడీపీ అధికారం ఒరగబెట్టింది. అప్పుడు నిందితులు ఎవరో తెలీలేదు. తర్వాత ఐదేళ్లు వైసీపీ అధికారంలో ఉంది. అప్పుడు కూడా నిందితులు ఎవరో కనిపెట్టలేకపోయింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా సేమ్ సీన్ రిపీటవుతోంది. ఇంతకీ సుగాలి ప్రీతీ హత్యకు కారకులెవరు..? ఈ కేసునే పరిష్కరించలేని ప్రభుత్వం ఇక జనాల సమస్యల్ని ఏం తీరుస్తుంది..? అన్న ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.
ఇకపోతే.. ఈ కేసుపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిన జనసేన అధినేత పవన్.. డిప్యూటీ సీఎం అయ్యాక మౌనంగా ఉండడంపై.. సోషల్ మీడియా సాక్షిగా నెటిజన్స్ విపరీతమైన ట్రోలింగ్ చేస్తున్నారు. అప్పట్లో ఆయన మాట్లాడిన మాటలు.. ఇచ్చిన హామీలతో.. నెట్టింట్లో వీడియోలు హల్‌చల్ చేస్తున్నాయి. మరోవైపు సీబీఐ ఈ కేసు నుంచి తప్పుకుంటుంటే.. కేంద్రంలో తన పరపతిని ఉపయోగించి.. సీబీఐనే ఈ కేసు దర్యాప్తు చేసేలా ఆర్డర్స్ ఎందుకు తీసుకురాలేకపోయారు..? సుగాలి ప్రీతీ కుటుంబానికి న్యాయం చేయాల్సిన అవసరం లేదా..? ఈ కేసులో నేరస్తులు ఎవరో కనిపెట్టాల్సిన ఆవశ్యకత లేదా..? అసలు నేరస్తుల్ని కటకటాల వెనక్కి పంపే చర్యలు తీసుకోరా..? ఈ ప్రశ్నలన్నింటికీ జనసేనాని సమాధానం చెప్పాలంటున్నారు. ప్రజల్ని కష్టాల నుంచి గట్టెక్కిస్తారనే కదా.. అధికారం కట్టబెట్టింది.
ఇకపోతే.. మళ్లీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. సుగాలి ప్రీతి తల్లి హోంశాఖ మంత్రి అనితను కలిశారు. ఈ కేసును సీఐడీకి అప్పగిస్తున్నట్టు అనిత చెప్పారని ఆమె వెల్లడించారు. కనీసం ఇప్పుడైనా బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. మరీ ముఖ్యంగా సుగాలి ప్రీతీ కేసుపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచిన పవన్‌కల్యాణ్ ఇప్పుడు అధికారంలో భాగస్వామి. సుగాలి ప్రీతి కేసులో నిందితులను పట్టుకోవడంలో ఆయన చొరవ చూపాల్సిన అవసరం వుంది. లేదంటే జనసేనాని రాజకీయ దోషిగా నిలబడక తప్పదు. గతంలో ప్రతిపక్ష నాయకుడిగా పవన్ చాలా విమర్శలు చేశారు. ఇప్పుడు అధికారంలో వున్న తర్వాత కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకోకపోతే అభాసుపాలు కావడం ఖాయం. మరి సేనానీ ఈ కేసును పరిష్కరించే దిశగా అడుగులు వేస్తారా..? అలాకాకుండా.. మౌనంగా ఉండిపోతే మాత్రం.. పీఠమెక్కాక పవన్ కూడా అందరి రాజకీయ నాయకుల్లానే ప్రవర్తిస్తున్నారని అనుకోవాల్సి ఉంటుంది.