నాణ్యమైన జీడిపప్పును కొనుగోలు చేయాలి -జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్
పార్వతీపురం మన్యం జిల్లా
వన్ ధన్ వికాస్ కేంద్రాల (వీడివీకె) సభ్యులు జిల్లాలో నెలకొల్పే జీడి పరిశ్రమలకు నాణ్యమైన జీడిపప్పును రైతుల నుంచి కొనుగోలు చేసుకునేలా సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ సంబంధిత అధికారులకు సూచించారు. పరిశ్రమల స్థాపనకు అవసరమయ్యే జీడి పప్పును ముందుగా సిద్ధం చేసుకోవాలని అన్నారు. ఈ ఏడాది 300 మెట్రిక్ టన్నుల జీడి పప్పు వీడివీకెల లక్ష్యం కావాలని కలెక్టర్ అధికారులకు దిశా నిర్ధేశం చేసారు. స్వయంగా జీడి పరిశ్రమలను ఏర్పాటుచేసుకొని క్రయ, విక్రయాలు జరుపుకునేలా వీడివీకెల సభ్యుల తీర్మానం తప్పనిసరి అని కలెక్టర్ గుర్తుచేశారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సబ్ కలెక్టర్లు, ఏపీఎంలు, ఉద్యానవన శాఖ అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వ్యాపారవేత్తలు రైతుల నుంచి నాణ్యమైన జీడిపప్పును ముందుగా కొనుగోలు చేసే అవకాశం ఉన్నందున, దాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుగానే వీడివీకె సభ్యులు కొనుగోలు చేసుకునేలా చూడాలని అన్నారు. కొనుగోలు చేసిన పప్పును ప్రాసెసింగ్ చేసి విక్రయాలు జరిపే వరకు అవసరమయ్యే గన్నీ బ్యాగులు, స్టోరేజ్ పాయింట్లను సిద్ధం చేయాలని తెలిపారు. అదేవిధంగా జీడి పరిశ్రమ లకు అవసరమైన యంత్ర సామాగ్రి, ప్రాసెసింగ్, క్రయ విక్రయాలు, బ్రాండింగ్, ప్యాకింగ్, రవాణా, మార్కెటింగ్ సదుపాయాలపై సభ్యులకు పూర్తిగా అవగాహన కల్పించి, శిక్షణ ఇప్పించాలని సూచించారు. ఏప్రిల్ 15 నాటికి ఈ ప్రక్రియ పూర్తికావాలని తేల్చి చెప్పారు. క్రయ విక్రయాలు, స్టోరేజ్ తదితర వాటికి చెందిన రికార్డులు పక్కాగా నిర్వహించుకునేలా ఇద్దరు వీడివీకె సభ్యులకు పూర్తి అవగాహన ఉండాలని అన్నారు. అలాగే క్రయ, విక్రయాలు జరిపే సమయంలో సాధారణ, గ్రేడ్- ఏ రకాల ధరలను తెలియజేసే పట్టికను అందరికి కనిపించేలా బోర్డులను ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. వీడివికేలు పరిశ్రమలు నెలకొల్పుకునేందుకు అవసరమయ్యే బ్యాంకు ఖాతా, జీఎస్టీ, లైసెన్స్, విద్యుత్ - నీటి సదుపాయాలు, వెంటిలేషన్, రానూ - పోనూ మార్గాలు, ఇతర ప్రాసెసింగ్ తదితర చర్యలు తీసుకోవాలని అన్నారు. నిర్ధిష్ట ప్రణాళిక ప్రకారం అన్నీ సకాలంలో జరగాలని, ఆ దిశగా అధికారులు చొరవ తీసుకోవాలని కలెక్టర్ వివరించారు. ఈ సమావేశంలో పార్వతీపురం, పాలకొండ ఐటీడిఏ ప్రాజెక్ట్ అధికారులు అశుతోష్ శ్రీవాస్తవ, సి.యశ్వంత్ కుమార్ రెడ్ది, వెలుగు ప్రాజెక్ట్ అధికారి వై.సత్యంనాయుడు, ఏపీఎంలు, ఉద్యానవన శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.