మేడిపల్లి సేజ్ స్కూల్ ఆవరణలో కట్టడాల కూల్చివేతలు
ఉప్పల్ మేడిపల్లి ఆర్‌ఏఆర్ కాలనీలోని సేజ్ పాఠశాల ప్రాంగణంలో నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి అనుసంధాన మార్గంలో ఈ అక్రమ నిర్మాణాలు ఉన్నాయని స్థానికుల నుంచి ఫిర్యాదులు అందడంతో అధికారులు ఈ చర్యలు చేపట్టారు.
పాఠశాల యాజమాన్యం కీలకమైన లింక్ రోడ్డులోని కొంత భాగాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిందని స్థానికులు కొన్నాళ్లుగా ఆరోపిస్తున్నారు. ఈ ఆక్రమణల వల్ల తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని, ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ కబ్జాపై కాలనీ వాసులు 15 ఏళ్లుగా పోరాడుతున్నారని తెలిసింది. అందిన ఫిర్యాదులపై స్పందించిన హైడ్రా అధికారులు, క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించారు. పాఠశాల యాజమాన్యం రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్లు ఈ తనిఖీల్లో నిర్ధారణ అయింది. దీంతో బుధవారం ఉదయం పోలీసు బందోబస్తు నడుమ ప్రత్యేక బృందాలు పాఠశాల వద్దకు చేరుకుని, రోడ్డుపైకి చొచ్చుకుని వచ్చిన అక్రమ నిర్మాణాలను కూల్చివేశాయి. ఈ కూల్చివేతల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు.