చార్ధామ్ యాత్ర పేరుతో చావు పరిచయం.. ప్రకటనలతో పంగానామలు పెట్టిన ట్రావెల్స్ యాజమాన్యం

By Ravi
On
చార్ధామ్ యాత్ర పేరుతో చావు పరిచయం.. ప్రకటనలతో పంగానామలు పెట్టిన ట్రావెల్స్ యాజమాన్యం

చార్దామ్ యాత్ర పేరుతో ఘరానా మోసం

యాత్రికులను నిలువునా మోసం చేసిన టూర్స్ అండ్ ట్రావెల్స్ యాజమాన్యం

భక్తి సంగతి సరే బతికి వచ్చాము చాలు అంటున్న బాధితులు

సంస్థపై కేసు వేసేందుకు సిద్ధమైన యాత్రికులు


సరస్వతీ పుష్కరాల స్పెషల్.. చార్ధామ్ యాత్ర పేరుతో  యాత్ర చేయాలనుకుంటున్నారా.. సొంత వాహనాల్లో వెళ్లి అక్కడ బస... ఇతర ఏర్పాట్లు ఎలా అని ఆలోచిస్తున్నారా.. డోంట్ వర్రీ వేము ఉన్నాము.. అన్ని సౌకర్యాలు చూసుకుంటాము.. క్షేమంగా పంపి ఆనందంగా వచ్చేలా చేస్తాము అంటూ ఓ టూర్ టైమ్స్ యాత్రికులకు పంగానామలు పెట్టింది. సౌకర్యాల సంగతి దేవుడు ఎరుగు.. బతికి బట్టకడితే చాలు అంటూ అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని పారిపోయి వచ్చేలా చేసింది. కోట్లు వసూలు చేసి కోటి కష్టాలకు గురి చేసిందంటూ ఆ యాత్రికులంతా తమ కుటుంబ సభ్యులకు గోడు వెళ్లబోసుకున్నారు.  హైదరాబాదులోని టూర్ టైమ్స్ సంస్థ మే 8 నుండి 22వ తారీకు వరకు 15 రోజులపాటు నిర్వహించిన చార్ధామ్ యాత్రలో  సుమారు 350 మంది యాత్రికులు పాల్గొన్నారు. యాత్ర సమయంలో జరిగిన మోసం , ఎదుర్కొన్న కష్టాలను  ట్రూ పాయింట్ న్యూస్ కి వారి గోసను వెల్లబోసుకుంటున్నారు. 
ఈ యాత్రకు ఇతర ప్రైవేటు ట్రావెల్స్ కన్నా అధిక మొత్తంలో (ఒక్కొక్కరి నుండి 58 నుండి 75 వేల వరకు) ఫీజు వసూలు చేశారని,  350 రైలు యాత్రికుల నుండి సుమారు రెండున్నర కోట్ల రూపాయలు వసూలు చేశారని చెప్పారు.  భారత్ గౌరవ్ అంటే కేంద్ర ప్రభుత్వ సహకారం మరియు ఉత్తరాఖండ్ టూరిజం శాఖ సహకారంతో యాత్రను నిర్వహిస్తున్నామని, యాత్రికులు ఎలాంటి కష్టనష్టాలకు లోను కాకుండా నిర్భయంగా సంతోషంగా యాత్రను కొనసాగించవచ్చని   నిర్వాహకులు హామీ ఇవ్వడంతో  డబ్బులు ఎంత ఖర్చు అయినా వెనకాడకుండా మేము ఇందులో ప్రయాణించామని బాధితులు నోముల శ్రీనివాస్ రెడ్డి, శంకరయ్య, మోహన్ రెడ్డి, దుర్గాప్రసాద్ తో పాటు అనేక మంది తెలిపారు. వారు చెప్పిన మాటల్లో...
 తీరా ప్రయాణం మొదలయ్యాక వీరి అసలు రంగు అర్థమయింది. ఉత్తరాఖండ్ టూరిజం పేరు చెప్పి *పెద్ద మోసం*. యాత్రికులమైన మాకు ఉత్తరాఖండ్ టూరిజం శాఖ ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. దర్శన ఏర్పాట్లు లేవు. వ్యక్తిగతంగా మేము ఎంతో శ్రమ కోర్చి సొంత ఏర్పాట్లు చేసుకున్నాం. సాధారణ యాత్రికుల కంటే అద్వాన్నమైన పరిస్థితి. వీరి ఉచ్చులో చిక్కిన తర్వాత  బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది.
*వసతి సౌకర్యం* పరమ నాసిరకం. కనీసం వేడి నీళ్ల సౌకర్యం సైతం లేని హోటల్లో బస. చలిలో గజగజ వణికి పోయాం. అన్ని *డొక్కు* బస్సులు. ఉత్తరాఖండ్ టూరిజం శాఖకు చెందిన బస్సుల మాట దేవుడెరుగు. అన్నీ చీప్ ప్రైవేటు ట్రావెల్స్. 350 మందిని 16  డొక్కు బస్సుల్లో కుక్కి ప్రయాణంలో హింసించారు. మా ప్రయాణంలో మొదటి రోజే ఒక బస్సు మార్గమధ్యంలో ఫెయిల్ అయితే వారికి కాళరాత్రి మిగిలింది. బస్సు ప్రయాణంలో ఎండ వేడిని  భరించలేక అనేకమంది ప్రయాణికులు సొమ్మసిల్లి పోయారు.*ఇక భోజనం*.. 
ఏమాత్రం తినదగినదిగా లేదు. అనేకమంది అర్ధాకలితో మాడిపోయారు .తిన్న కొందరు వాంతులు విరోచనాలతో బాధపడ్డారు. నిజం చెప్పాలంటే గుర్రాలకు పెట్టిన దాణా మిగిలిపోతే వాటిని యాత్రికుల కోసం తలా కొంచెం పంచారు. ఆ మాత్రం ఆహారం కూడా వెనుక వరుసలో నిలబడిన వారికి దొరకలేదు .
ప్రతి యాత్రికునికి *ఒక* వాటర్ బాటిల్ మాత్రమే ఉచితంగా అందించారు. తదుపరి ఎన్ని బాటిల్స్ అయినా కాఫీ, టీ లతో పాటు కొనుక్కోవాల్సిందే.
కేదార్ నాథ్ లో మంచు కురిసే టెంట్ లో రాత్రి బస చేయించి ఏకంగా నరకానికి దారి చూపించారు .అక్కడ అనేకమంది అనారోగ్యానికి గురయ్యారు. కనీసం దర్శన ఏర్పాట్లకు సంబంధించిన సమాచారం ఇచ్చే నాధుడే కరువయ్యారు. తమ సిబ్బందితో దగ్గరుండి దర్శనాలు చేపిస్తామని హామీ ఇచ్చి జారుకున్నారు.
అత్యధిక డబ్బులు గుంజి ఏమాత్రం పట్టించుకోని ట్రావెల్స్ యాజమాన్యంపై ప్రభుత్వం విచారణ జరిపి చర్యలు చేపట్టాలని మేము కోరుతున్నాం.
ప్రతిష్టాత్మకమైన భారత్ గౌరవ్ పేరును వాడుకొని మరియు ఉత్తరాఖండ్ టూరిజం శాఖ పేరుతో జరుపుతున్న మోసంపై విచారించి చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం.
 మాలో కొందరు యాత్రికులు టూర్ ఆపరేటర్లపై చీటింగ్ కేసు వేయడం లేదా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించడానికి సైతం వెనుకాడ బోమని ట్రావెల్స్ యాజమాన్యాన్ని హెచ్చరిస్తున్నాం. 
నేడు ప్రభుత్వం బెట్టింగ్స్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన యూట్యూబర్లపై చేపడుతున్న చట్టపరమైన చర్యల తరహాలో ట్రావెల్స్ సంస్థతో కుమ్మక్కై ఈ చార్ధామ్ యాత్రను ప్రమోట్ చేసిన నాగశ్రీ ఛానల్ పై కేసు నమోదు చేయాలని కోరుతున్నాం. 
ప్రభుత్వాల పేరు చెప్పి భారత గౌరవాన్ని మంట కలిపిన టూర్ టైమ్స్ ట్రావెల్ సంస్థను ప్రభుత్వం మూసివేయాలని కోరుతున్నాం.
ఇది ఒకరు కాదు ఇద్దరు కాదు 350 మంది పాల్గొన్న యాత్రలో సుమారు 126 మంది తమ ఆవేదన వ్యక్తం చేశారు. మరికొందరు అనారోగ్యంతో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ టూర్స్ అండ్ ట్రావెల్ యాజమాన్యానికి 9160091414 కాల్ చేస్తే స్విచ్ ఆఫ్,  మరో నెంబర్ 916002414కి పాయింట్ న్యూస్ ప్రతినిధులు కాల్ చేస్తే నో రెస్పాన్స్. ఈ టీమ్ మరో 600 మంది యాత్రికులతో  రెండో టూర్ ప్లాన్ చేసినట్లు సమాచారం. సో యాత్రికులకు మాదో విన్నపం.. ఊరుకాని ఊరు వెళ్లి నానా అవస్థలు పడే కంటే ఇలాంటి మోసాలు చేసే ట్రావెల్స్ వివరాలు ఒకటికి పదిసార్లు తెలుసుకొని వెళితే మంచిది. లేదంటే భక్తితో వెళ్లిన మీకు జీవితంపై విరక్తి ఖాయం. అయితే బాధితుల్లో కొందరు నిలదీస్తే వీరి వెనకాల ఉన్న కొందరు నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆవేదనతో వెల్లడించారు. IMG-20250521-WA0079

Tags:

Advertisement

Latest News

ఆపరేషన్ కగార్.. బాబుపై బాంబుదాడి సూత్రదారి మృతి ఆపరేషన్ కగార్.. బాబుపై బాంబుదాడి సూత్రదారి మృతి
చత్తీస్ ఘడ్ అడవుల్లో  తుపాకుల మోత మోగుతోంది. మా వోయిస్టులను భద్రతా దళాలు చుట్టు ముట్టాయి. దీంతో, మరోసారి భారీ ఎదురు దెబ్బ తగిలింది.  ఆపరేషన్ కగార్...
చదివింది విదేశాల్లో.. డ్రగ్స్ వ్యాపారం స్వదేశంలో
సినీ ప్రేక్షకులకు శుభవార్త.. ఆ నిర్ణయం ఇక లేనట్లే....
చార్ధామ్ యాత్ర పేరుతో చావు పరిచయం.. ప్రకటనలతో పంగానామలు పెట్టిన ట్రావెల్స్ యాజమాన్యం
రోడ్డు విస్తరణలో బయటపడ్డ అక్రమాలు.. కబ్జారాయుళ్లతో అధికారుల కుమ్మక్కు
#Draft: Add Your Title
బంజారాహిల్స్ లో మహిళా వైద్యురాలిపై లైంగిక దాడి