నాంపల్లి నుంచి అన్ రిజర్వుడ్ ప్రత్యేక రైళ్లు.. వాటి వివరాలు ఇవే
కర్ణాటకలోని కలబురగిలో హజరత్ ఖ్వాజా సయ్యద్ బందె నవాజ్ షరీఫ్ దర్గా ఉర్సు వైభవంగా ఆరంభం అయ్యాయి. దర్గా 621వ ఉత్సవాలు ఇవి. దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఈ ఉత్సవాలకు హాజరవుతున్నారు. ఛాదర్లు సమర్పించుకుంటారు. ఈ నెల 14వ తేదీన ఉర్సు ఆరంభమైంది. 31వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ ఉర్సుకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే అధికారులు నాంపల్లి నుంచి ప్రత్యేక రైళ్లను నడిపిస్తోన్నారు. ఇవన్నీ కూడా అన్ రిజర్వుడ్ ప్రత్యేక రైళ్లు కావడం వల్ల సాధారణ ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా ఉంటోంది. 16, 17 తేదీల్లో ఉదయం 7 గంటలకు నాంపల్లి నుంచి బయలుదేరిన నంబర్ 07178 ప్రత్యేక రైలు.. మధ్యాహ్నం 12:30 నిమిషాలకు కలబురగికి చేరుకుంటుంది. ఇవే తేదీల్లో సాయంత్రం 6 గంటలకు కలబురగి నుంచి బయలుదేరే నంబర్ 07177 ప్రత్యేక రైలు రాత్రి 11:55 నిమిషాలకు నాంపల్లికి చేరుకుంటుంది.
బేగంపేట్, సనత్ నగర్, హఫీజ్ పేట్, లింగంపల్లి, నాగలాపల్లి, శంకర్ పల్లి, గుళ్లగూడ, చిట్గిద్ద, వికారాబాద్, గోదామ్ పురా, ధర్పూర్, రుక్మాపూర్, తాండూర్, మంథట్టి, నావద్గీ, కుర్గుంట, సేడం, మల్ఖైద్ రోడ్, చిత్తాపూర్, వాడి మీదుగా రాకపోకలు సాగిస్తుంది. ఇవన్నీ కూడా అన్ రిజర్వుడ్ ప్రత్యేక రైళ్లు కావడం వల్ల సాధారణ ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా ఉంటోంది. కలబురగి హజరత్ ఖ్వాజా బందె నవాజ్ షరీఫ్ దర్గా ఉర్సును దర్శించడానికి తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివెళ్తుంటారు. హైదరాబాద్ నుంచి వెళ్లే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. తెలంగాణ సరిహద్దు జిల్లాల ప్రజలు దర్గాను దర్శించుకుని ఛాద్దర్లు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.