ట్రాఫిక్ జామ్ లో ఆగిన అంబులెన్స్ లు .. జాతీయ రహదారిపై హల్చల్ చేసిన వ్యక్తులు
పటాన్ చెరువు పోలీస్ స్టేషన్ పరిధి రుద్రారం గ్రామ శివారులోని జాతీయ రహదారిపై నలుగురు యువకులు బీభత్సం సృష్టించారు. రోడ్డుపై ఆగి ఉన్న కారును వెనుక నుండి ఢీకొట్టిన అనంతరం, కారులో ఉన్న వారిపై దాడి చేసి గంట పాటు హల్చల్ చేశారు.
నగర శివారులోని ప్యాలస్ హోటల్ ముందు ముంబాయి జాతీయ రహదారిపై ఓ కారు ఆగి ఉండగా, వెనుక నుంచి వేగంగా వచ్చినా బైక్ కారును ఢీకొట్టింది. దీంతో ఆగ్రహానికి గురైన అదే బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు కారులో ఉన్న వారిపై దాడి చేశారు. ఈ ఘటనతో ఒక్కసారిగా అక్కడ గందరగోళం నెలకొంది. ఈ దాడి కారణంగా జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సుమారు అరగంట పాటు వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న అంబులెన్సులు సైతం ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో రోగులకు సకాలంలో వైద్య సహాయం అందక ఇబ్బందులకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గొడవ పడుతున్న ఇరువురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై గంట సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు డిమాండ్ చేశారు.