టర్కీతో ఒప్పందం రద్దు చేసుకున్న యూనివర్సిటీ
సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటన చేసిన మౌలానా యూనివర్సిటీ
టర్కీతో ఇక సంబంధాలు రద్దు
పాకిస్తాన్ కి మద్దత్తుగా నిలచిన టర్కీతో విద్యాపరమైన ఒప్పందం ఇక ఉండదని చెప్పిన యూనివర్సిటీ
హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (MANUU) సంచలన నిర్ణయం తీసుకుంది. టర్కీకి చెందిన యూనస్ ఎమ్ర్రే ఇన్‌స్టిట్యూట్‌తో కుదుర్చుకున్న విద్యాపరమైన అవగాహన ఒప్పందాన్ని (ఎంఓయూ) తక్షణమే రద్దు చేస్తున్నట్లు విశ్వవిద్యాలయం అధికారికంగా ప్రకటించింది. భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో, పాకిస్థాన్ ఉగ్రవాద కార్యకలాపాలకు టర్కీ మద్దతు ఇస్తోందని, దీనికి నిరసనగానే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు విశ్వవిద్యాలయం ఒక పత్రికా ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ ఏడాది జనవరి 2వ తేదీన మౌలానా ఆజాద్ వర్సిటీ మరియు యూనస్ ఎమ్ర్రే ఇన్‌స్టిట్యూట్ మధ్య ఐదేళ్ల కాల వ్యవధి కోసం ఈ ఒప్పందం కుదిరింది.
ఈ ఎంఓయూ కింద, మౌలానా ఆజాద్ వర్సిటీలోని స్కూల్ ఆఫ్లాంగ్వేజెస్, లింగ్విస్టిక్స్ & ఇండాలజీ విభాగంలో టర్కిష్ భాషలో డిప్లొమా కోర్సును ప్రారంభించారు. ఈ కోర్సు బోధన నిమిత్తం టర్కీ నుంచి ఒక విజిటింగ్ ప్రొఫెసర్‌ను కూడా నియమించడం జరిగింది. అయితే, ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో సదరు విజిటింగ్ ప్రొఫెసర్ ఇప్పటికే తన స్వదేశానికి తిరిగి వెళ్లిపోయారని విశ్వవిద్యాలయ వర్గాలు తెలియజేశాయి. ఈ నిర్ణయంతో టర్కీ సంస్థతో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీకి ఉన్న విద్యా సంబంధాలు పూర్తిగా తెగిపోయినట్లయింది.