నల్లాలు ఉన్నాయి.. నీళ్లు రావు.. నిలదీసిన మహిళలు
శామీర్ పేట్ మండలం లాల్ గడి మలక్ పేట్ గ్రామంలో కాలనీ వాసులు నీళ్లకోసం రోడెక్కారు. తమకు నీటి సరఫరా సరిగా చేయడం లేదని గ్రామ పంచాయతీ వద్ద ఇందిరమ్మ కాలనీ వాసులు ధర్నా నిర్వహించారు. ఏ గ్రామంలో లేని నీటి సమస్య లాల్ గడి మలక్ పేట్ గ్రామంలోనే ఎందుకు వస్తుందని గ్రామ పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డిని గ్రామస్తులు నిలదీశారు. గ్రామానికి రావాల్సిన నీళ్లు సరిగా రావడం లేదని, వచ్చిన నీళ్లనే సర్ధుబాటు చేస్తున్నామని సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి కాలనీ వాసులకు సమాదానం చెప్పారు. మిషిన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ గ్రామంలో నీటి సమస్య తలెత్తుతుందని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెల రోజుల నుండి గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్ల కాలనీకి నీటి సమస్య ఉందన్నారు. 15 రోజుల క్రితం నీళ్ల సమస్య ఉందని అడగగా ఒక్క ట్యాంకర్ తెచ్చి కొందరికి మాత్రమే నీళ్లు పోసి మళ్లి నీటిని పంపిణీ చేయడం లేదన్నారు. పన్నులు, ట్యాక్సులు కట్టకపోతే నల్లా కనెక్షన్ లు కట్ చేస్తామని అధికారులు హెచ్చరిస్తారని, నెల రోజుల నుండి నీరు సరిగా రావడం లేదని ఫిర్యాదు చేస్తే పట్టించుకునే వారే లేరని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. తమకు నీటి సమస్య పరిష్కరించకుంటే ఎంతదూరమైన పోయి ధర్నా చేస్తామని హెచ్చరించారు.