ఓఎంసీ కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి షాక్
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై. శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో ఊహించని పరిణామం ఎదురైంది. ఈ కేసు నుంచి ఆమెను విముక్తురాలిని చేస్తూ (డిశ్చార్జ్ చేస్తూ) గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పూర్తిగా పక్కన పెట్టింది. ఈ మేరకు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మి పాత్రపై మూడు నెలల్లోగా మరోసారి విచారణ జరపాలని సుప్రీంకోర్టు ధర్మాసనం నేడు ఆదేశించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఎలాంటి సంబంధం లేకుండా, ఆ తీర్పు ప్రభావం పడకుండా స్వతంత్రంగా ఈ విచారణ చేపట్టాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
కాగా 2022 సంవత్సరంలో తెలంగాణ హైకోర్టు ఈ కేసులో శ్రీలక్ష్మి దాఖలు చేసుకున్న డిశ్చార్జ్ పిటిషన్‌ను అనుమతించి, ఆమెకు ఊరట కల్పించిన విషయం తెలిసిందే. తాజాగా సుప్రీంకోర్టు ఆ నిర్ణయాన్ని తోసిపుచ్చడంతో శ్రీలక్ష్మికి మళ్ళీ చిక్కులు తప్పేలా లేవు.