చెట్టుకిందే మల్కాజిగిరి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం.. వినూత్న నిరసన తెలిపిన మర్రి రాజశేఖర్ రెడ్డి
మల్కాజిగిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లేకపోవడం వలన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడానికి వినూత్నంగా నిరసన తెలిపారు స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. జిహెచ్ఎంసి కార్యాలయం ఎదుట ఉన్న చెట్టు కింద కూర్చొని ప్రజలతో కలిసి ఎమ్మెల్యే ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా ఒక శాశ్వత క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా, అధికారుల వద్ద విజ్ఞప్తులు చేసినా ఎలాంటి స్పందన లభించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చివరికి చెట్టు కిందే తాత్కాలికంగా క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు స్వయంగా విని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. తమ బాధలు చెప్పుకునేందుకు ఎక్కడికి వెళ్లాలో తెలియక సందిగ్ధంలో ఉన్న మల్కాజిగిరి ప్రజలకు ఇది కొంత ఊరట కలిగించిన విషయమైంది. ప్రభుత్వం తక్షణమే మల్కాజిగిరి నియోజకవర్గానికి శాశ్వత క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.