ఎక్స్ ప్రెస్ వేపై యుద్ధవిమానాల ల్యాండింగ్..
వాయుసేన యుద్ధవిమానాలు ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఎక్స్ ప్రెస్ వేపై టేకాఫ్, ల్యాండింగ్ ను ప్రాక్టీస్ చేస్తున్నాయి. నేడు ఉత్తర్‌ప్రదేశ్ లోని షాజహాన్ పుర్ లోని గంగా ఎక్స్ ప్రెస్ వేపై ఉన్న దాదాపు 3.5 కిలోమీటర్ల ఎయిర్ స్ట్రిప్‌పై ఈ సాధన జరుగుతోంది. దీనిని యుద్ధవిమానాలు ల్యాండింగ్‌కు అనుకూలంగా నిర్మించారు. ఎక్స్‌ప్రెస్ రహదారి రన్‌వేకు ప్రత్యామ్నాయంగా ఎంత మేరకు ఉపయోగపడుతుందనే అంశాలను ఈ సందర్భంగా పరిశీలిస్తున్నారు. ఇవి రెండు భాగాలుగా జరగనున్నాయి. ఉదయం, రాత్రి ల్యాండింగ్, టేకాఫ్ చేయనున్నారు. ఉదయం సాధారణ వేళల్లోనే ఈ పరీక్షలు జరుగుతున్నాయి. కానీ, రాత్రి మాత్రం 7 గంటల నుంచి 10 గంటల మధ్యలో వీటిని నిర్వహించనున్నారు.
ఓ పక్క భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరిన వేళ ఈ పరీక్షలు జరగడం గమనార్హం. యుద్ధ విమానాల రాక నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి జాగ్రత్తలు తీసుకొంది. దాదాపు 250 సీసీ కెమెరాలను ఇక్కడ ఇన్‌స్టాల్ చేసింది. నిన్నటి నుంచే ఈ మార్గం పూర్తిగా వాయుసేన నియంత్రణలోకి వెళ్లిపోయింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో యుద్ధ విమానాలు దిగేలా నిర్మించిన నాలుగో ఎక్స్ ప్రెస్ వే ఇది. గతంలో ఆగ్రా-లఖ్‌నవూ ఎక్స్‌ప్రెస్‌వే, పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే, బూందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ సౌకర్యాలున్నాయని అధికారులు తెలిపారు.