రానున్న 5 ఏళ్లలో రోబోలే సర్జన్స్: ఎలాన్ మస్క్
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కారణంగా ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందని ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రాబోయే 5 ఏళ్లలో రోబోలు వైద్యులను అధిగమించి.. బెస్ట్ సర్జన్లుగా మారతాయని అంచనా వేశారు. ప్రస్తుతం తన న్యూరాలింక్ కంపెనీలో మానవ మెదడులో కంప్యూటర్ ఎలక్ట్రోడ్లను అమర్చే పని రోబోతోనే నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. సామాన్యంగా మానవులకు కష్టమైన ఈ పనిని రోబో వేగంగా, కచ్చితంగా చేస్తోందని అన్నారు. భవిష్యత్తు జరిగే శస్త్రచికిత్సల్లో మోడ్రన్ టెక్నాలజీతో రూపొందించిన రోబోల వాడకం అధికమవుతుందని మస్క్ పేర్కొన్నారు. దీనివల్ల సర్జన్ల ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందన్నారు.
కాగా మస్క్ కామెంట్స్ పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. ప్రస్తుతం శస్త్ర చికిత్సల కోసం ఉపయోగించే సర్జికల్ రోబోలు స్వయంగా పని చేయలేవని.. వాటిని మానవ సర్జన్లు నియంత్రిస్తారని అన్నారు. భవిష్యత్తులో ఎంతటి సాంకేతికత వచ్చినప్పటికీ మానవుల ప్రమేయం లేకుండా యంత్రాలు అన్ని పనులు చేయలేవని అన్నారు. మస్క్ అంచనా నిజం కావాలంటే చాలాకాలం పడుతుందని.. 5 ఏళ్లలో మాత్రం సాధ్యం కాదని రాసుకొచ్చారు. కాగా ప్రజంట్ ఈ పోస్టులు వైరల్ అవుతున్నాయి.