ట్రూప్స్ బార్‌పై ఎక్సైజ్ శాఖ దాడులు.. కల్తీ మద్యం స్వాధీనం..!
పప్పుల నుంచి ఉప్పు, కారం, పసుపు, పాలు, పెరుగు, అల్లం, బెల్లం ఇలా.. ఒకటేమిటి అన్ని వస్తువులు కల్తీ బారిన పడుతున్నాయి. చివరకు మద్యాన్ని కూడ కల్తీ చేస్తున్నారని వింటున్నాం. కానీ.. ఈ రోజు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ యంత్రాంగం బార్‌లో మద్యాన్ని కల్తీ చేస్తుండగా.. రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల వెల్లడించిన వివరాల ప్రకారం.. లింగంపల్లి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప సోసైటీ ప్రాంతంలో ట్రూప్స్ బార్‌ను రెన్యువల్ చేయలేదు. ఫీజు కూడా చెల్లించలేదని రంగారెడ్డి ఏఈఎస్ జీవన్ కిరణ్.. ఎక్సైజ్ సిబ్బందితో కలిసి బార్‌పై రైడ్ చేశారు. బార్‌లో కూకట్‌పల్లికి చెందిన సత్యనారాయణ, పునిక్ పట్నాయక్ కలిసి ఖరీదైన మద్యం బాటిళ్ల సీల్ తీసి తక్కువ ధరలు కలిగిన మద్యాన్ని కలుపుతుండగా రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. రూ. 2690 ధర కలిగిన జేమిసన్ బాటిల్‌లో రూ.1000 ధర కలిగిన ఓక్స్‌మిత్ మద్యాన్ని కలుపుతుండగా పట్టుకున్నారు. బార్‌లో మద్యాన్ని కల్తీ చేస్తున్న స్థలంలో ఎక్కువ బాటిళ్లలో తక్కువ ధరలు కలిగిన మద్యాన్ని నింపిన 75 బాటిళ్లను, 55 ఖాళీ బాటిళ్లను ఎక్సైజ్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. కొంత కాలంగా ట్రూప్ బార్ లైసన్స్ ఫీజ్ చెల్లించలేదు. దీనికి తోడు మద్యం డిపోల నుంచి లిక్కర్ తీసుకోవడం లేదనే అనుమానంతో ఎక్సైజ్ యంత్రాంగం తనిఖీలకు వెళ్లారు. ఇతర మద్యం దుకాణాల్లో కొనుగోలు చేసి.. ఎక్కువ ధరలు కలిగిన బాటిళ్లలో తక్కువ ధర మద్యాన్ని కలుపుతూ అమ్మకాలు చేపడుతూ సొమ్ము చేసుకుంటున్నారని విచారణలో వెల్లడైంది. రూ.1.48 లక్షల విలువ చేసే మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొని.. బార్ లైసన్స్ ఓనర్ ఉద్యాకుమార్ రెడ్డి, మేనేజర్ సత్యనారాయణ రెడ్డి, బార్‌లో పని చేసే ఉద్యోగి పునిత్ పట్నాయక్‌లపై కేసు నమోదు చేసి లింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించినట్లు ఏఈఎస్ జీవన్ కిరణ్ తెలిపారు. కల్తీ మద్యాన్ని పట్టుకున్న కేసులో ఏఈఎస్‌తో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ సుభాష్ చందర్ రావు. ఎస్సైలు వెంకటేశ్వర్లు, అఖిల్, కానిస్టేబుళ్లు సుధాకర్, కిషన్, శ్రీనివాస్, సుదీప్ రెడ్డి, పెంటారెడ్డి, దుర్గ శ్యామ్ ప్రసాద్‌లు ఉన్నారు. కల్తీ మద్యం బాటిళ్ల కేసును చేధించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్‌ను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి, డిప్యూటి కమిషనర్ దశరథ్, అసిస్టెంట్ కమిషనర్ కిషన్ అభినందించారు.