పార్లమెంటే సుప్రీం: ఉప రాష్ట్రపతి
రాష్ట్రపతిని సుప్రీం కోర్టు ఆదేశించలేదంటూ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ కామెంట్ చేశారు. ఈ కామెంట్స్ తీవ్రంగా వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో తాజాగా ఆయన మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. రాజ్యాంగపరమైన అంశాల్లో ఎన్నికైన ప్రజాప్రతినిధులే అల్టిమేట్ మాస్టర్స్ అని ధన్‌ఖడ్ పేర్కొన్నారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులు జవాబుదారీతనంగా ఉండాలి. ఎమర్జెన్సీ విధించిన ప్రధాని అయినా సరే. ప్రజలకు రక్షణ కల్పించేందుకే ప్రజాస్వామ్యం. రాజ్యాంగపరమైన అంశాల్లో ప్రజాప్రతినిధులే అల్టిమేట్ మాస్టర్స్. పార్లమెంట్ కంటే అత్యుత్తమమైనది ఉందని రాజ్యంగంలో ఎక్కడా లేదు. పార్లమెంటే సుప్రీం అని ధన్‌ఖడ్ అన్నారు. అంతేకాకుండా ఎమర్జెన్సీ సమయంలో ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగిందన్నారు. రాష్ట్ర గవర్నర్ పంపిన బిల్లులకు రాష్ట్రపతి నిర్ణీత గడువులోపు సమ్మతి తెలపాలని సుప్రీంకోర్టు గడువు నిర్ణయిస్తూ ఇటీవల తీర్పునిచ్చింది.
ఈ ఘటనపై ధన్‌ఖడ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతికి గడువు నిర్దేశించేలా న్యాయవ్యవస్థ వ్యవహరించడం తగదు. ప్రజాస్వామ్యశక్తులపై అణుక్షిపణిని సుప్రీంకోర్టు ప్రయోగించరాదు. ఇప్పుడు.. శాసనాలు చేయగలిగే జడ్జీలు మనకు ఉన్నారు.. కార్యనిర్వాహక విధులూ వారే నిర్వర్తించేస్తారు. సూపర్ పార్లమెంటులా వ్యవహరిస్తారు. వారికి మాత్రం ఎలాంటి జవాబుదారీతనం ఉండదు. ఎందుకంటే దేశ చట్టాలు వారికి వర్తించవు అని ఆయన అన్నారు.