దేశవ్యాప్తంగా సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ తీసుకునే నిర్ణయాలు పాక్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దౌత్యదాడికి దిగిన భారత్ మరో వైపు యుద్ధానికి రెడీ అవుతున్నట్లు సిగ్నల్స్ ఇస్తుండడంతో పాక్ కు వెన్నులో వణుకు పుడుతుంది. ఈ క్రమంలో భారత ప్రభుత్వం 2025 మే 7న దేశవ్యాప్తంగా 244 గుర్తించబడిన పౌర రక్షణ జిల్లాల్లో భారీ మాక్ డ్రిల్ నిర్వహించబోతోంది. క్షిపణి దాడులు లేదా వైమానిక దాడులు వంటి యుద్ధం లాంటి పరిస్థితులలో సాధారణ ప్రజలు ఎంత త్వరగా, సమర్థవంతంగా స్పందించగలరో పరీక్షించడం దీని ఉద్దేశ్యం. ఈ మాక్ డ్రిల్ ఉద్దేశ్యం భయాందోళనలను నివారించడం, గందరగోళాన్ని తగ్గించడం, ప్రాణాలను కాపాడటం. మే 7న జరగనున్న ఈ జాతీయ స్థాయి రిహార్సల్ కోసం, హోం మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మే 2, 2025న సూచనలను జారీ చేసింది.
ఒక వేళ రాత్రిపూట వైమానిక దాడి జరిగితే నగరాన్ని శత్రువుల దృష్టి నుంచి దాచగలిగేలా విద్యుత్తు అకస్మాత్తుగా ఆపివేయబడుతుంది. ఈ టెక్నాలజీ చివరిసారిగా 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో ఉపయోగించబడింది. ఉపగ్రహ లేదా వైమానిక నిఘాను నివారించడానికి సైనిక స్థావరాలు, కమ్యూనికేషన్ టవర్లు, విద్యుత్ ప్లాంట్లు వంటి వ్యూహాత్మక భవనాలను మాస్క్ చేస్తారు. వాస్తవ పరిస్థితుల్లో తలెత్తే అడ్డంకులను గుర్తించగలిగేలా అధిక ప్రమాదకర ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలింపు నిర్వహిస్తారు.