సిటీలోని సింగరేణి కాలనీలో రౌడీషీటర్ల అరాచకం..!
హైదరాబాద్ సైదాబాద్ సింగరేణి కాలనీలో రౌడీషీటర్ల అరాచకం రోజురోజుకూ పెచ్చుమీరుతోంది. తాజాగా ఓ ఆటోడ్రైవర్‌ను చితకబాది నలుగురు రౌడీషీటర్లు దారి దోపిడీకి పాల్పడ్డారు. సింగరేణి కాలనీలో 24 గంటలూ బ్లాక్‌లో మద్యం విక్రయిస్తుంటారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎక్కడ మద్యం దొరకకపోయినా.. ఇక్కడ మాత్రం తెల్లవార్లు మద్యం ఏరులై పారుతుంది. ఇక్కడ చీప్ లిక్కర్ నుంచి స్కాచ్ విస్కీ వరకు అన్ని రకాల మద్యం 24 గంటలూ అందుబాటులో ఉంటుంది. ఈ క్రమంలో.. గత రాత్రి పవన్ అనే ఆటోడ్రైవర్ ఇంటికి వెళ్తున్న సమయంలో.. వంశీ, అంజి, కిట్టు అలియాస్ కృష్ణ, నరేష్ అనే నలుగురు రౌడీషీటర్లు మరో 15 మంది అనుచరులతో అతన్ని చితకబాది.. బెదిరించి అతని దగ్గర నుంచి డబ్బులు లాక్కున్నారు. ఈ ఘటన ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. దీంతో పవన్ సైదాబాద్ పోలీస్‌స్టేషన్‌కు ప్రాణభయంతో పరుగులు పెట్టాడు. అతని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ ఫుటేజీల సాయంతో దర్యాప్తు చేస్తున్నారు.
ఈ నలుగురు రౌడీషీటర్లు అర్ధరాత్రుల సమయంలో నగరం నుంచి మద్యం కోసం వచ్చేవారిలో.. రోజుకో యువకుడ్ని టార్గెట్ చేస్తూ.. కత్తులు, తపంచాలతో బెదరిస్తూ.. దారి దోపిడీలకు పాల్పడుతున్నారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. మరోవైపు కేసు నమోదు చేసి విషయం తెలిసిన వెంటనే నలుగురు రౌడీషీటర్లు అప్రమత్తమై నగరం వదిలి పరారైనట్లు సమాచారం. పోలీసులు వీరి కోసం గాలింపు ముమ్మరం చేశారు.