ఇక తగ్గేదే లే.. జగడమే..
- తనకంటూ కొత్త ఆఫీస్ ప్రారంభించిన కవిత
- తండ్రికి ఇచ్చిన నోటీసులపై ఆందోళనకు సిద్ధం
- అన్న చేయని పని నేను చేసి చూపిస్తా అంటూ సవాల్
- తన బలం.. బలగం ఏంటో ఇక తెలిసిపోతుందని అంటున్న కవిత
By. V. Krishna kumar
Tpn: స్పెషల్ డెస్క్
ఇక ఎక్కడ తగ్గేదే లే.. తాడోపేడో.. నేనేంటో చూపిస్తా.. బాపు కోసం ప్రతిపక్షాలను బెంబేలెత్తిస్తా.. కాస్కో.. చూస్కో.. అంటూ కుండ బద్దలు కొడుతోంది ఎమ్మెల్సీ కవిత. కేటీఆర్ టార్గెట్ గా తన కార్యాచరణకు పదును పెడుతున్నారు. తన భవిష్యత్ రాజకీయ వేదికను బలోపేతం చేసుకుంటున్నారు. ఇదే సమయంలో తన తండ్రికి మద్దతుగా కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. పరోక్షంగా తన అన్న కేటీఆర్ ను ఫిక్స్ చేస్తున్న కవిత తదుపరి ఆసక్తికర అడుగులు వేశారు . తండ్రి పైన విధేయత చూపిస్తునే.. అన్న పైన పోరాటనికి సిద్దమయ్యారు. పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసి అన్నకే సవాల్ విసిరారు. లేఖతో రాజకీయ సంచలనంగా మారిన కవిత.. తన తండ్రి కేసీఆర్.. బీఆర్ఎస్ ను కాపాడుకోవటం తన లక్ష్యమని చెబుతున్నా.. కవిత రాజకీయ అడుగులు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కవిత లేఖ తరువాత కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలతో మంత్రాంగం సాగించారు. కవిత వ్యవహారంలో వేచి చూసే ధోరణితో కనిపిస్తున్నారు. అటు ఈ వ్యవహారంలో కేటీఆర్ లక్ష్యంగా కవిత అడుగులు స్పష్టంగా ఉన్నాయి. కేటీఆర్ వ్యూహాత్మకంగానే ఈ సమయంలో విదేశీ పర్యటనకు వెళ్లారు. వర్కింగ్ ప్రెసిడెంట్ ట్వీట్లకే పరిమితం అవుతారా అంటూ తన అన్న ను టార్గెట్ చేసిన కవిత.. కేసీఆర్ కు నోటీసులు ఇస్తే ఆందోళనలు చేయరా అంటూ నిలదీశారు. ఇప్పుడు తానే ఆ పనికి సిద్దమైనానని చెప్పారు. పార్టీ నేతల నుంచి తనకు మద్దతు లేకపోవటం.. తన అన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండటంతో తన సొంత సంస్థ జాగృతి నుంచి తన రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించారు. అందులో భాగంగా తన ఇంటి వద్దే కొత్తగా జాగృతి ప్రధాన కార్యాలయం ప్రారంభించారు. ఇదే సమయంలో తన తండ్రి కోసం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన అన్న చేయలేనిది తాను చేసి చూపిస్తానే విధంగా కవిత నేరుగా రంగంలోకి దిగుతున్నారు. కాళేశ్వరం కమిషన్ ప్రాజెక్టులో అక్రమాలపై విచారణ కోసం కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది. జూన్ 5న విచారణకు కేసీఆర్ హాజరు కావాల్సి ఉంది. దీనికి నిరసనగా కవిత జూన్ 4న ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు నిర్ణయించారు. ఇది ఒక విధంగా కేటీఆర్ ను ఫిక్స్ చేయటమే. ఇదే సమయంలో కేటీఆర్ కంటే తాను సమర్ధురాలినని నిరూపించుకునే ప్రయత్నంలో కవిత ఉన్నట్లు స్పష్టం అవుతోంది. పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన కవిత ప్రయత్నం నెక్స్ట్ పార్టీ ప్రకటన పక్కా అని తెలిసిపోతోంది.