అన్నింటికంటే ఆక్వాపైనే అతిపెద్ద ఎఫెక్ట్..!
- ఏటా రూ.75 వేల కోట్ల ఆక్వా ఎగుమతులు
- ఏపీ నుంచే 34 శాతం ఆక్వా ఉత్పత్తులు
- ఏపీలో 4 లక్షల ఎకరాల్లో ఆక్వా పరిశ్రమ
- ఆక్వా కల్చర్‌లో 1.4 లక్షల మంది రైతులు
- ట్రంప్ నిర్ణయంతో ఆక్వా ఎగుమతులపై 34 శాతం పన్ను
- ఏపీలోని ఆక్వా పరిశ్రమపై భారీ ప్రభావం
అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ నిర్ణయం ఆక్వా రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దయచేసి ఆక్వా రంగంపై అమెరికా విధిస్తున్న పన్నుల వ్యవహారంపై ఆ దేశంతో చర్చలు జరపండని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు. ఐతే.. ఆక్వా రంగంపై ట్రంప్‌తో ఇండియా ఎలా బేరసారాలు చేస్తుందని అంతా భావిస్తున్నారని.. కానీ.. వాస్తవాలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయని... ఆక్వా రంగంలో పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు.
ఇక ట్రంప్ తెచ్చిన కొత్త టాక్స్ టారీఫ్‌తో తీవ్రంగా నష్టపోతామని చెబుతున్నారు ఆక్వా కంపెనీల యజమానులు. ట్రంప్ ప్రస్తుతం విధిస్తున్న కొత్త పన్నుతో, తాము ఆక్వా ఉత్పత్తులపై దాదాపు 34 శాతం పన్ను చెల్లించాల్సి ఉందని.. ఇది ఆక్వా పరిశ్రమపై భారీ భారం అవుతుందన్నారు. క్రమంగా 30 కౌంట్ పంటలు మాత్రమే కొనసాగుతాయని.. ఇతర ఖరీదైన పంటలు తగ్గుతాయన్నారు. ప్రభుత్వాలు జోక్యం చేసుకుని ఈ సమస్యకు పరిష్కారం కనిపెట్టాలని కోరుతున్నారు. ఇప్పటికే ఈ దిశగా చర్చలు సాగుతున్నాయని.. సానుకూల రీతిలో ఫలితం వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఐతే.. ట్రంప్ నిర్ణయం నుంచి కోలుకోవడానికి ఒక నెల సమయం పడుతుందని ఉదయ్ ఆక్వా కనెక్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ కిషన్ చెరుకునీడి అభిప్రాయపడ్డారు.
భారతదేశం నుంచి ఏటా దాదాపు 20 లక్షల మెట్రిక్ టన్నుల ఆక్వా ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నందున.. ఈ సమస్య తీవ్రత చాలా పెద్దగా ఉందన్నారు. ఈ ఆక్వా ఉత్పత్తుల విలువ సుమారు రూ.75 వేల కోట్లు. దీంతో ఎగుమతులలో ఆక్వా ఉత్పత్తులు ఎంత ముఖ్యమో మనం ఊహించవచ్చు. అంతేకాకుండా, భారతదేశంలోని ఆక్వా ఎగుమతుల్లో ఏపీ నుంచే 34 శాతం ఉత్పత్తి అవుతున్నాయి. దాదాపు 4 లక్షల ఎకరాలు ఆక్వా కల్చర్ కింద ఉన్నాయి. సుమారు 1.4 లక్షల మంది రైతులు ఆక్వా ఉత్పత్తిలో ఉన్నారు. అందుకే ఇండియాలోని ఆక్వా ఎగుమతులపై పన్ను విధించాలనే ట్రంప్ నిర్ణయంతో ఏపీ ఆక్వా రైతులంతా టెన్షన్‌లో ఉన్నారు. ఇది ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అనేక లక్షల కుటుంబాలను ప్రభావితం చేస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని అక్వా రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.