సన్నబియ్యం లబ్ధిదారుల ఇంట్లో కాంగ్రెస్ నేతల సహపంక్తి భోజనం..!
మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని మల్లాపూర్ గ్రామంలో ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యం లబ్ధిదారులు బల్గురి విజయమ్మ ఇంట్లో టీయూఎఫ్ఐడీసీ చైర్మన్, డీసీసీ అధ్యక్షుడు చల్లా నరసింహరెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మాజీ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి భోజనం చేసి వారి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ మాట్లాడుతూ పేదలు సైతం సన్న బియ్యం తినాలనే సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి అందిస్తున్న సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రజలు హర్షిస్తున్నారని అన్నారు. గతంలో తీసుకున్న బియ్యం తినడానికి వీలుకాకపోవడంతో వాటిని వినియోగించుకోలేకపోయారని.. ఇప్పుడు పేద కుటుంబాలు కడుపారా తింటున్నాయని చెప్పారు. వీటితో పాటు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిత్యావసర వస్తువులు కూడా రేషన్ ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరారు. మహిళలకు ఉచిత బస్సు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ బోయపల్లి గోవర్ధన్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పన్నాల రాజేందర్ రెడ్డి, మాజీ డైరెక్టర్ బొర్రా జగన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు వంగేటి ప్రభాకర్ రెడ్డి, పెద్దబావి సుదర్శన్ రెడ్డి, నేనావత్ బాలు నాయక్, మహేశ్వరం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుభాన్ యాదవ్, నాయకులు రవి కాంత్ రెడ్డి, సాయి ముదిరాజ్, టేకుల సుధాకర్ రెడ్డి, రంజిత్, ప్రవీణ్, గిరి ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.