టీటీడీ గోమరణాలపై వైసీపీ అసత్య ప్రచారాలు : ప్రశాంతిరెడ్డి
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టకు భంగం కలిగించాలని ప్రయత్నించిన వారెవరైనా.. ఆ దేవదేవుడి ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు టీటీడీ పాలక మండలి సభ్యురాలు, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. వృద్ధ్యాప్యం కారణంగా టీటీడీ గోశాలలో గోవుల సహజ మరణాలపై దుష్ప్రచారం చేస్తున్న వైసీపీ నాయకుల వాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. టీటీడీ గోశాలలో 100 ఆవులు చనిపోయాయన్న భూమన కరుణాకర్‌రెడ్డి మాటలు పచ్చి అబద్ధాలన్నారు. ఎక్కడో చనిపోయిన గోమాతల ఫోటోలను మార్ఫింగ్ చేసి టీటీడీ గోశాలపై దురుద్దేశాలు ఆపాదిస్తున్నారని మండిపడ్డారు.
కోటి మంది దేవతలకు సమానమైన గోమాతలపై దుష్ప్రచారం చేస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. టీటీడీ గోశాలలో గోవుల పరిరక్షణ మరియు సంరక్షణ కోసం దాదాపు 260 మంది పని చేస్తుంటారని, వృద్ధ్యాపం కారణంగా గోవుల సహజ మరణాలు సర్వసాధారణ విషయమని.. ఇందులో భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గోవుల సహజ మరణాలపై అసత్య ప్రచారాలు చేస్తూ టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.