జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే లక్ష్యంగా పని చేస్తాం: JCHSL కార్యవర్గం
హైదరాబాద్, ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో "ది జర్నలిస్ట్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ (JCHSL)" జనరల్ బాడీ సమావేశం సొసైటీ అధ్యక్షుడు బ్రహ్మాండభేరి గోపరాజు అధ్యక్షతన ఈ రోజు జరిగింది. గత నాలుగు సంవత్సరాలుగా పర్సన్ ఇన్‌చార్జ్ ఆధీనంలో ఉన్న సొసైటీకి ఇటీవల జరిగిన ఎన్నికల ద్వారా కొత్త కార్యవర్గం ఏర్పడిన నేపథ్యంలో ఐదు ఏళ్ల తర్వాత ఈ సమావేశం నిర్వహించడం విశేషం.
సమావేశంలో గత ఐదు సంవత్సరాల ఆడిట్ రిపోర్ట్‌ను సభ్యుల సమక్షంలో చదివించి ఆమోదం పొందారు. ఈ సందర్భంగా సొసైటీ సభ్యులు ప్రభుత్వం తక్షణం స్పందించి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధన కోసం ప్రభుత్వం, సంబంధిత శాఖలతో నిరంతరం సంప్రదింపులు జరిపేందుకు కార్యవర్గం కట్టుబడి పనిచేయాలని తీర్మానించారు.అలాగే, సొసైటీ ఆస్తుల పరిరక్షణ, జర్నలిస్టుల కాలనీల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై మరింత శ్రద్ధ తీసుకుని పనిచేయాలని నిర్ణయించారు.
ఈ సమావేశంలో సొసైటీ కార్యదర్శి మిక్కిలినేని రవీంద్రబాబు, ఉపాధ్యక్షులు మాసాదే లక్ష్మీనారాయణ, జాయింట్ సెక్రటరీ డా. చల్లా భాగ్యలక్ష్మి, ట్రెజరర్ భీమగాని మహేశ్వర్ గౌడ్, డైరెక్టర్లు డి. కమలాకరాచార్య, హాష్మీ, డి. వెంకటాచారి, స్వేచ్చ తదితరులు పాల్గొన్నారు. సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేశారు.