ఏప్రిల్ నెలలో ముగ్గురి అవతార పురుషుల జయంతులు

By Ravi
On
ఏప్రిల్ నెలలో ముగ్గురి అవతార పురుషుల జయంతులు

TPN.... C.N.MURTHY
P.GANNAVARAM
APL...4

  • ఏప్రియల్ 5 న బాబు జగ్జీవన్  రాం
  • ఏప్రియల్ 11 న మహాత్మా జ్యోతిరావు పూలే
  • ఏప్రియల్ 14 న డా.బి.ఆర్.అంబేద్కర్

భగవంతుడు తాను నిర్వర్తించవలసిన కొన్ని విధులను కొంతమంది అవతార మూర్తులను భూలోకానికి పంపి వారి ద్వారా నెరవేరుస్తుంటాడు . వాళ్లనే మనం సంఘ సంస్కర్తలని కూడా పిలుచు కొంటాం. అటువంటి కోవలోకే వస్తారు ఇప్పుడు మనం తెలుసుకోబోయే ముగ్గురు అవతారమూర్తులు. ముఖ్యంగా ఆ ముగ్గురు మూర్తులూ ఏప్రియల్ నెలలోనే జన్మించడం విశేషం . వారు లేకున్నా వారి ఆశయాలను, సిద్ధాంతాలను నెరవేర్చేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి.
ఏప్రియల్ 5 న  భారత ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రాం,ఏప్రియల్ 11న,గొప్ప సామాజికవేత్త, మహాత్మా జ్యోతిరావు పూలే,ఏప్రియల్ 14 న ,భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేద్కర్ ల జయంతి లు జరగడం ఎంతో విశేషం.ఈ ముగ్గురూ సామాజిక రుగ్మతలను పారద్రోలడంతో పాటు ముఖ్యంగా మహిళాభివృద్ధికి కృషి చేశారని పేర్కొనవచ్చు .

 మహాత్మా జ్యోతిరావు ఫూలే ...

కుల వ్యవస్థ నిర్మూలనతోపాట అంటరానితనం , మహిళా సంక్షేమం . కోసం అవిరళ కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే . అణగారిన కులాల ప్రజలు సమాన హక్కులు పొందటానికి " సత్య శోధక్ సమాజ్ " ను ఏర్పాటు చేశాడు . 1827 ఏప్రియల్ 11 న మహారాష్ట్ర లోని సతారా జిల్లాలోని బి.సి సామాజిక వర్గానికి చెందిన " మాలి " కుటుంబానికి చెందిన అప్పటి సామాజిక వేత్త , ఉద్యమకారుడు గోవిందరావు పూలే దంపతులకు జన్మించారు . పీష్వాల కాలంలో వారి కుటుంబం పూల వ్యాపారం చేయడం వల్ల వారి కుటుంబీకుల ఇంటిపేరు పూలే గా మారింది . సామాజిక  సంస్కరణలలో భాగంగా భారతదేశం లో మహిళా విద్యకు మార్గదర్శకుడయ్యాడు. . ఇందుకు పూలే భార్య సావిత్రి బాయి పూలే కూడా ఎంతగానో సహకారం అందించింది.తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా పేరుగాంచింది . 1848 లో బాలికల కోసం ప్రత్యేకంగా ఒక పాఠశాలను స్థాపించారు . పూలే చిన్నతనం నుండే చదువుతో పాటు సమాజంలో జరుగుతున్న వివిధ సామాజిక రుగ్మతల పట్ల దృష్టి సారించారు . కొన్ని కారణాల వల్ల చదువు మానివేయడంతో , అతనికి చదువుపై గల ఆసక్తిని గమనించిన ఒక ముస్లిం ఉపాధ్యాయుడు , క్రైస్తవ పెద్ద కలిసి పూణే లో నిర్వహిస్తున్న స్టాటిష్ మిషన్ పాఠశాల లో చేర్పించారు . విద్యార్థి దశ  నుండే పూలేకు శివాజీ అంటే ఎంతో ఇష్టం . శివాజీతో పాటు వాషింగ్టన్ జీవిత చరిత్రలు ఎక్కువగా ప్రభావితం చేయడం వల్ల దేశ భక్తి తో పాటు నాయకత్వ లక్షణాలు అలవాటయ్యాయి . థామస్ రచించిన " మానవ హక్కులు " పుస్తకం పూలే ఆలోచనలను ప్రభావితం చేసింది . ఆ రోజులలో ఎక్కువగా బాల్య వివాహాలు జరగటం , ముక్కుపచ్చలారని బాలికలకు ముదుసరుల తో ముడిపెట్టడం , తో వారు చిన్నతనంలోనే వితంతువులు కావటం వారి జీవితాలు దుర్భరంగా మారటాన్ని గమనించిన పూలే వితంతు పునర్వివాహాల గురించి ప్రజలలో చైతన్యం తీసుకొచ్చారు . 1877 లో సత్య సమాజం తరఫున " దీనబంధు " వార పత్రిక ప్రారంభించాడు . సమాజంలో అణగారిన వెనుకబడిన వర్గాల కు చెందిన మహిళల అభ్యున్నతి కోసం కృషి చేసినందుకు పూలేకు మహాత్మా బిరుదు లభించింది . సమ సమాజ స్థాపన కోసం పరి తపించిన మహాత్మా పూలే 1890 నవంబర్ 28 న మరణించారు .

డా.బి.ఆర్.అంబేద్కర్...

ప్రపంచ మేధావి, భారత రాజ్యంగ నిర్మాత , పత్రికాధిపతి ,దేశ మొదటి న్యాయ శాఖామంత్రి, ప్రముఖ సంఘ సంస్కర్త డా.బి.ఆర్.అంబేద్కర్ గురించిఎవరికీ చెప్పవలసిన అవసరం లేదు . విద్యార్థుల స్థాయి నుండి వృద్ధుల వరకు అంబేద్కర్ పేరు సుపరిచితమే . 1891 ఏప్రియల్ 14 న మెహర్ కులానికి చెందిన రాంజీ మలోజీ సాక్పాల్ , భీమా బాయి దంపతులకు 14 వ సంతానంగా అంబేద్కర్ జన్మించారు . తండ్రి భారత సైన్యంలో సుబేదారుగా పనిచేశారు . దురదృష్టవశాత్తు అంబేడ్కర్ తన 6 వ ఏటనే తల్లి భీమబాయి ని పోగొట్టుకున్నారు . పాఠశాల స్థాయి నుండి అంబేద్కర్ కుల వివక్షను ఎదుర్కొన్నారు . అప్పటికే సామాజిక సమస్యలపై పోరాడుతున్న మహాత్మా జ్యోతిరావు పూలేను తన గురువుగా పేర్కొని , ఆయన బాటలోపయనిస్తూ , అన్ని రకాల సామాజిక సమస్యలను ఎదుర్కొని 1912 లో బి .ఎలో ఉత్తీర్ణుడయ్యాడు . 1915 లో ఎం.ఎ. 1916 లో పి.హెచ్.డి పట్టా పొందారు . అంబేద్కర్ తన  32 వ ఏట బార్ ఎట్ లా ను, కొలంబియా విశ్వ విద్యాలయం నుండి, డి.ఎస్.సి పట్టాను లండన్ విశ్వ విద్యాలయం నుండి  పొందారు . 1927 లో " బహిష్కృత భారత్ " అనే మరాఠీ పక్ష పత్రికను ప్రారంభించారు . 1930 , 1931,1932 సంవత్సరాలలో బ్రిటిష్ ప్రభుత్వం నిర్వహించిన 3 రౌండ్ టేబుల్స్ సమావేశాల్లో దళితులకు ప్రత్యేక నియోజక వర్గాలివ్వాలని పట్టుబట్టారు . 1932 లో రామ్స్ మెక్ డోనాల్డ్ కమ్యూనల్ అవార్డును అంబేద్కర్ కు ప్రకటిచడంతో , దళితులకు ప్రత్యేక నియోజక వర్గాల కోసం ప్రతిపాదనలు జరిగాయి . గాంధీజీ " హరిజన సేవక్ సమాజ్ " ఏర్పాటు చేసి అస్పృశ్యతా నివారణ కోసం కృషి చేస్తూ , దానిలో అంబేద్కర్ ను భాగస్వామిని చేశారు . దేశ మొదటి న్యాయ శాఖామంత్రి గా,రాజ్యాంగ పరిషత్ సభ్యునిగా అంబేద్కర్ కఠోర శ్రమకోర్చి వివిధ దేశాల రాజ్యాంగాలను క్షుణ్ణంగా  అధ్యయనం చేసి ప్రధానంగా 8 దేశాల రాజ్యాంగాలలో ఉన్న మంచి మంచి విషయాలను పొందుపర్చి మన దేశానికి అనువుగా ఉండే రాజ్యాంగాన్ని రచించారు .రాజ్యాంగ రచనా సమయంలో నియమితులైన ఇతర  ఏడుగురు  సభ్యులు వివిధ కారణాల వల్ల వైతొలగటంతో , మొత్తం రాజ్యాంగ రచన భారమంతా అంబేద్కర్ భుజాలపై పడింది . ఎన్నో సమస్యలు ఎదురైనా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి స్వదస్తూరీ తో రాజ్యాంగాన్ని లిఖించిన ఘనత అంబేద్కర్ కు దక్కింది . దేశంలో అన్ని రంగాలలో ఎంతో పేరు  ప్రఖ్యాతులు సంపాదించిన అంబేద్కర్ 1956 డిసెంబర్ 6 న తుదిశ్వాస విడిచారు . ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయన మరణాంతరం భారత రత్న అవార్డును ప్రధానం చేసింది .


 బాబూ జగ్జీవన్ రాం ....

బాబూజీ గా ప్రసిద్ధిగాంచిన జగ్జీవన్ రాం ఎంతో పేరొందిన స్వాతంత్య్ర సమర యోధుడు , సుదీర్ఘ పార్లమెంటేరియన్ , అంతకు మించి గొప్ప సంఘ సంస్కర్త . 1908 ఏప్రియల్ 5 న బీహార్ లోని భోజ్ పూర్ జిల్లా చంద్వా గ్రామంలో చమర్ కులానికి చెందిన సాఖీరాం , వాసంతీ దేవి దంపతులకు జన్మించారు . 1914 లో ప్రాధమిక విద్య నభ్యసించారు . 1920 లో మాధ్యమిక విద్యను , 1922 లో అర్రా టౌన్ పాఠశాల లో చదివారు . అక్కడ కుల వివక్షను ఎదుర్కొన్నారు . 1925 లో పాఠశాలలో ఏర్పాటు చేసిన మంచినీటి కుండల వ్యవహారం జగ్జీవన్ రాం జీవితాన్నే మార్చేసాయి . కాశీ లో ఉన్న బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ వ్యవస్థాపకుడు పండిట్ మదన్ మోహన్ మాలవ్య జగ్జీవన్ రాం చదువుతున్న పాఠశాలను సందర్శించినప్పుడు తన ప్రసంగంతో మదన్ మోహన మాలవ్యనే ఆకట్టుకొన్నాడు . ప్రసంగానికి ముగ్ధుడైన మాలవ్య జగ్జీవన్ రాం ను విశ్వవిద్యాలయం లో చేరాలని ఆహ్వానించారు . 1927 లో మెట్రిక్యులేషన్ ప్రధమ డిజిజన్ లో పాసై విశ్వవిద్యాలయం లో చేరారు . అక్కడ కూడా కుల వివక్ష నెలకొనడంతో కలకత్తా విశ్వవిద్యాలయం లో చేరారు . 1935 లో అఖిల భారత అణగారిన వర్గాల కూటమి స్థాపనకు సహకరించారు . 1940 లో ప్రారంభమైన సత్యాగ్రహం , క్విట్ ఇండియా ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నారు . భారత రాజ్యాంగ పరిషత్ లో దళితుల హక్కుల కోసం వాదించారు . రాజకీయంగా నెహ్రూ ప్రభుత్వం లో పిన్న వయస్సు కలిగిన మంత్రిగా పేరుగాంచి అంచెలంచెలుగా ఎదిగి వివిధ శాఖలను సమర్ధవంతంగా నిర్వహించి భారత ఉప ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు . సుమారు 40 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యునిగా కొనసాగిన బాబూజీ 1986 జులై 6 న కన్నుమూశారు .

ఆ మహనీయులను అనునిత్యం తలచుకొంటూ వారి ఆశయ సాధనకు కృషి చేస్తూ, వారు కన్న కలలను నిజం చేద్దాం .

Tags:

Advertisement

Latest News

సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ముగిసిన ఈడీ సోదాలు..! సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ముగిసిన ఈడీ సోదాలు..!
హైదరాబాద్ TPN : మనీలాండరింగ్‌ ఆరోపణలతో హైదరాబాద్‌లోని సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ఈడీ సోదాలు నిర్వహించింది. మొత్తం నాలుగు చోట్ల సోదాలు నిర్వహించిన ఈడీ.. అక్రమ మార్గాల్లో...
సిమెంట్ పరిశ్రమలపై ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ప్రతాపం..!
బెట్టింగ్ యాప్ భూతానికి మరో యువకుడు బలి..!
ఎన్నికల నియమావళికి అనుగుణంగా విధులు నిర్వహించాలి : అనురాగ్ జయంతి
ఇద్దరు కొడుకుల్ని చంపి ఆత్మహత్య చేసుకున్న మహిళ..!
జపాన్‌ పర్యటనలో తొలిరోజే రేవంత్‌ బృందం కీలక ఒప్పందాలు..!
26.7 కేజీల గంజాయి పట్టివేత..!