సిమెంట్ పరిశ్రమలపై ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ప్రతాపం..!

By Ravi
On
సిమెంట్ పరిశ్రమలపై ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ప్రతాపం..!

కడప TPN :

- అల్ట్రాటెక్ సిమెంట్స్‌కు ఫ్లైయాష్, సున్నపురాయి సరఫరా అడ్డగింత

- ముడిసరుకు రవాణా తనవారికే ఇవ్వాలని డిమాండ్ 
- ఇప్పటికే కొన్ని కాంట్రాక్టులిచ్చిన అల్ట్రాటెక్ సిమెంట్స్ యాజమాన్యం
- అన్నీ కావాలంటూ ఒత్తిడి... కుదరదన్నందుకు ఐదు రోజులుగా లారీల అడ్డగింత
- ఓ ప్లాంట్‌లో ఆగిన ఉత్పత్తి, మరో ప్లాంట్‌లో నిలిచిపోయే అవకాశం


కడప జిల్లాలోని జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సిమెంట్ పరిశ్రమలపై జులుం ప్రదర్శిస్తున్నారు. అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమకు అవసరమైన ముడి సరుకు రవాణాతోపాటు, అక్కడ ఉత్పత్తి అయిన సిమెంట్‌కు సంబంధించిన రవాణా కాంట్రాక్టులన్నీ తనకే ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే యాజమాన్యం కొన్ని కాంట్రాక్టులు ఆయన అనుయాయులకే ఇచ్చినా.. అవి సరిపోవని మొత్తం అన్నీ తమకే ఇవ్వాలంటూ తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు. అలా కుదరదన్నందుకు ఆ పరిశ్రమలకు ముడిసరుకు రవాణా కానివ్వకుండా ఆపేశారు. దీంతో ఇప్పటికే ఓ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిచిపోగా, మరో ప్లాంట్ కూడా ఆగిపోనుంది.

జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని ఎర్రగుంట్ల, చిలమకూరుల్లో అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ యూనిట్లు ఉన్నాయి. గతంలో ఇండియా సిమెంట్స్ యాజమాన్యం ఆధీనంలో ఉండగా.. వీటిని అల్ట్రాటెక్ సంస్థ కొనుగోలు చేసింది. డిసెంబరు నుంచి ఆ సంస్థ ఆధీనంలోకి వెళ్లాయి. తాజాగా గత శనివారం నుంచి ఈ యూనిట్లకు అవసరమైన ఫ్లైయాష్, సున్నపురాయి సరఫరా జరగకుండా ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. ఎర్రగుంట్లలో ఉన్న రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి ఫ్లైయాష్ రవాణా చేసే లారీలను ఆపేశారు. ఫ్లైయాష్ రవాణా చేయవద్దంటూ అక్కడి సీఐ లారీల యజమానులకు హుకుం జారీ చేయడంతో లారీలు నిలిచిపోయాయి. సిమెంట్ పరిశ్రమలకు సమీపంలో ఉన్న గనుల నుంచి సున్నపురాయిని రవాణా చేస్తుంటారు. ఈ లారీలను సైతం ఆపేశారు. ఎమ్మెల్యే తన మనుషులను రంగంలోకి దింపడంతో.. పరిశ్రమలోకి సున్నపురాయి తీసుకెళ్లే మార్గంలో ఓ మినీ బస్సును అడ్డంగా పెట్టి లారీలను నిలిపేశారు. వారంతా అక్కడే చెట్లకింద ఉండి పహారా కాస్తున్నారు. ఇలా ఐదు రోజులుగా ఫ్లైయాష్, సున్నపురాయి సరఫరా ఆగిపోవడంతో.. చిలమకూరు ప్లాంట్లో సిమెంట్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఎర్రగుంట్ల ప్లాంట్‌లో ఇప్పటివరకు
ఉన్న ముడిసరుకుతో సిమెంట్ ఉత్పత్తి జరిగింది. తాజాగా అందులో కూడా మెటీరియల్ కొరత ఏర్పడటంతో.. ఆ యూనిట్లో కూడా ఉత్పత్తి నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది.

అల్ట్రాటెక్ పరిశ్రమలో కార్యకలాపాలకు అడ్డుతగులుతున్న ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డితో పాటు ఆయన అనుచరులపై కలెక్టర్ చెరుకూరి శ్రీధర్‌కు ఆ కంపెనీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. శనివారం నుంచి పరిశ్రమ ప్రాంగణంలో మినీ బస్సును అడ్డుపెట్టి మెటీరియల్ సరఫరాకు ఆటంకం కలిగిస్తున్నారని వివరించారు. పరిశ్రమలో ఉత్పత్తి నిలిచిపోగా... ఎర్రగుంట్ల యూనిట్‌లోనూ ఉత్పత్తి స్తంభించే అవకాశం ఉందని పేర్కొన్నారు. కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని ఎస్పీ అశోక్ కుమార్‌తో ఫోన్లో మాట్లాడారు. పోలీసు బలగాలను పరిశ్రమల దగ్గర పంపి అరాచకాలకు పాల్పడే వారిని వెంటనే అణచివేయాలని ఆదేశించారు. కంపెనీ ప్రతినిధుల నుంచి ఫిర్యాదు స్వీకరించిన ఎస్పీ.. బాధ్యులపై కేసు నమోదు చేయించి మెటీరియల్ సరఫరా పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. ఆదినారాయణరెడ్డి ప్రధాన అనుచరుడు జగదీశ్వర్‌రెడ్డితోపాటు పలువురిపై కేసులు నమోదయ్యాయి. తాజా పరిస్థితిని ప్రభుత్వానికి కలెక్టర్ నివేదించారు.

Advertisement

Latest News

పశ్చిమ్‌బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి : వీహెచ్‌పీ పశ్చిమ్‌బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి : వీహెచ్‌పీ
పశ్చిమ్‌బెంగాల్‌లో ముష్కర మూకలు హిందువులపై దాడులు చేసి చంపడం దారుణమని.. కేంద్ర ప్రభుత్వం వెంటనే అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని వీహెచ్‌పీ జాతీయ అధికార ప్రతినిధి రావినూతల...
అక్రమ నిర్మాణాల కూల్చివేతపై హైడ్రాకు అభినందనలు..!
తెలంగాణ పోలీసులపై కిడ్నాప్‌ కేసు..!
హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!