నగరంలో విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ ప్రారంభం
- ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ఇ.పి.డి.సి.ఎల్.
- విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకే ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు
- తూర్పు ప్రాంత విద్యుత్ సంస్థ సి.ఎం.డి. పృథ్వీతేజ్
విజయనగరం : విద్యుత్ వాహనాలను ప్రోత్సహించాలనే రాష్ట్ర ప్రభుత్వ క్లీన్ ఎనర్జీ విధానంలో భాగంగా తూర్పు ప్రాంత విద్యుత్ సంస్థ ఆధ్వర్యంలో విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లను ప్రైవేటు భాగస్వామ్యంతో పిపిపి విధానంలో ఏర్పాటు చేస్తున్నట్టు సంస్థ సి.ఎం.డి. ఇమ్మడి పృథ్వీతేజ్ చెప్పారు. తూర్పు ప్రాంత విద్యుత్ సంస్థ ఆధ్వర్యంలో పది విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్‌లను పైలట్ విధానంలో తమ విద్యుత్ సబ్‌స్టేషన్ల వద్ద ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్నామని దీనిలో మొదటి ఛార్జింగ్ స్టేషన్ విజయనగరంలో ప్రారంభించినట్లు వెల్లడించారు. తూర్పు ప్రాంత విద్యుత్ సంస్థ, వి.ఎన్.గ్లోబల్ ఎంటర్ ప్రైజెస్ సంస్థతో కలసి నగరంలోని పాత జిల్లా కోర్టు కాంప్లెక్స్ ఎదురుగా విశాఖ రోడ్డులో ఏర్పాటు చేసిన విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్‌ను సి.ఎం.డి. శుక్రవారం ప్రారంభించారు.
విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట్రంలో వచ్చే ఐదేళ్లలో ఐదు వేల విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యాన్ని నిర్దేశించారని దీనిలో భాగంగా ఇ.పి.డి.సి.ఎల్. ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో విద్యుత్ ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. పి.ఎం.సూర్యఘర్ లో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పదివేల మంది ఎస్.సి., ఎస్.టి. వర్గాల ఇళ్లకు సౌరవిద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. వారికి ఇంటిపైకప్పుపై ఏర్పాటుకు స్థలం వుంటే ఇంటిపైనే ఏర్పాటు చేస్తామని, స్థలం లేని పక్షంలో ఇంటికి దగ్గరలో వుండే ఖాళీస్థలంలో ఏర్పాటు చేస్తామన్నారు. తమ సంస్థ పరిధిలోని జిల్లాల్లో ఇప్పటివరకు 7,800 సూర్యఘర్ యూనిట్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. యీ జిల్లాలో 700 వరకు యూనిట్లు ఏర్పాటైనట్లు చెప్పారు. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకొనే విధానాన్ని సులభతరం చేయడం జరిగిందని, పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకొంటే త్వరగా యూనిట్లు ఏర్పాటు చేయడం జరగుతుందన్నారు.